Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!

నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!

శ్రీశైలం

చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. రాయలసీమ నుంచి వచ్చేవారు అహోబిలం మీదుగా మహానంది, అక్కడి నుంచి అటవీ మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబ దర్శనం అనంతరం, దగ్గరలోని ఇష్టకామేశ్వరి ఆలయం, మల్లెల తీర్ధం జలపాతం, పాతాళగంగ చూసుకొని రాత్రి అక్కడే బస చేయవచ్చు.

వసతి సదుపాయం

దేవస్థానం సత్రాలతో పాటు టి.టి .డి. కాటేజ్‌లు కూడా ఉన్నాయి.దేవస్థానం ఫోన్ నెంబర్లు : 08524-288883,288885, 288886

గంగ, యమున కాటేజ్ ఫోన్ : 08524-287351

నల్లమల్ల అడవి.... ఆధ్యాత్మిక యాత్రలు

Photo Courtesy:Vedamurthy.j

మహానంది

మరుసటి రోజు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం నుంచి దోర్నాల మీదుగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహానంది చేరుకోవడం ఓ ఆధ్యాత్మిక అనుభవం. మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం.ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది.మహానందిలో పర్వతసానువుల్లో కొలువైన నందీశ్వర స్వామి దర్శనం ఆహ్లాదం కలిగిస్తుంది. ఆలయం వెనుక ఉన్న కొండల నుంచి స్వచ్ఛమైన నీరు వేసవిలో సైతం కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. నందీశ్వరుని కిందుగా వచ్చే ఆ ధార, ఆలయం ఎదురుగా ఉండే కోనేరులో పడుతుంది. ఆ కోనేరులో భక్తులంతా స్నానాలు చేస్తారు. ఐదున్నర అడుగులు లోతు ఉన్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే ఉన్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.కాగా మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పిలుస్తారు.అన్నిటినీ దర్శిస్తే గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది.

వసతి సదుపాయం

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన 28 గదుల సత్రం, మహానంది దేవస్థానం నిర్మించిన 5గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి గృహాలు వున్నాయి.

ఫోన్ నెంబర్లు :

దేవస్థానం కార్యాలయం - 08514 234726, 234727, 234728
పున్నమి అతిథి గృహం 9441733829

నల్లమల్ల అడవి.... ఆధ్యాత్మిక యాత్రలు

Photo Courtesy:sai sreekanth mulagaleti

నవ నారసింహం(అహోబిలం)

మహానంది నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అహోబిలం క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నవ నారసింహులు వెలసి ఉన్నందున నవ నారసింహ క్షేత్రమని పిలుస్తారు. నరసింహ స్వామి కొండ కిందా పైనా వెలసి ఉండటంతో దిగువ, ఎగువ అహోబిలమని పిలుస్తారు. ఇక్కడ నివసించే చెంచులు నృసింహ దేవునికి జుంటి తేనె, అడవి మాంసం నైవేద్యముగా సమర్పించి పూజిస్తారు. నరసింహుడు చెంచులక్ష్మిని పరిణయమాడినట్లుగా భావించి చెంచులు అల్లుడిగా మర్యాదలు చేస్తారు. ఈ ఆలయాలన్నీ ప్రకృతి సోయగాలతో అలరారుతూ ఉంటాయి.అహోబిల నరసింహస్వామి(ఎగువ అహోబిలం), మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహ స్వామి, కారంజ నరసింహ స్వామి, భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్రవట నరసింహ స్వామి, పావన నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహ స్వామి(దిగువ అహోబిలం)లు నవ నారసింహులుగా పూజలందుకుంటున్నారు. ఎగువ అహోబిలం ఆలయం పక్క నుంచి రమణీయమైన కొండలు, జలపాతాలను చూసుకుంటూ నవనారసింహుల్లోని ముగ్గురు నరసింహ స్వాముల్ని దర్శించుకోవచ్చు. ఓపిక ఉన్న వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ 5 కిలోమీటర్లు నడిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నడవలేని వారికి డోలీ సౌకర్యం కూడా వుంది. గండశిల నుంచి చూస్తే నల్లమల అందాలన్నీ ఒకచోటు పోగేసుకున్నాయా అనిపిస్తుంది.ప్రకృతి ఆరాధన స్ఫూర్తిని మనలో కలిగించేందుకే పుణ్యక్షేత్రాలను పర్వతాలు, అడవులు, నదీనదాల చెంత ఏర్పాటు చేశారనేందుకు అహోబిల క్షేత్రం నిదర్శనం. శ్రీశైలం, మహానంది, అహోబిలం క్షేత్రాలు చూసేందుకు కనీసం మూడు రోజుల సమయం కేటాయిచాలి. టూరిజం గెస్ట్‌హౌస్‌తో పాటు దేవస్థానం వసతి కూడా అందుబాటులో ఉంటుంది.

వసతి సదుపాయం

మఠం వారి మాలోల అతిథి గృహం ఫోన్ నెం:08519-252045
ఏపీ టూరిజం వారి హరిత అతిథి గృహం ఫోన్:08519-252060
టీటీడీ అతిథిగృహం ఫోన్ నెం:08519-252045
అహోబిలం మేనేజర్ కార్యాలయం ఫోన్ నెం: 08519-252025

నల్లమల్ల అడవి.... ఆధ్యాత్మిక యాత్రలు

Photo Courtesy:Gopal Venkatesan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X