• Follow NativePlanet
Share
» »అంతుపట్టని రహస్యాల్లో ... ఆలయాలు !

అంతుపట్టని రహస్యాల్లో ... ఆలయాలు !

Written By: Venkatakarunasri

భారత దేశాన్ని మిస్టరీల భూమి అని అనవచ్చు కారణం సైన్స్ కి సైతం జవాబు చెప్పలేని ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. కొంత మంది ఇక్కడ పేర్కొనబడిన ప్రదేశాలకు సంభంధించి ఎటువంటి రహస్యం లేదు అది కేవలం పురాణాల లో చెప్పబడినది అని, మరికొంతమంది కాదు ఇది నిజమే అని వాదిస్తుంటారు. ప్రస్తుతం మీకు ఇక్కడ చెప్పబడుతున్న ప్రదేశాలు భారత దేశం లో మత సంభంధమైన ప్రదేశాలు. మీకు వీటి గురించి మరింత సమాచారం కావాలంటే పురాతన గ్రంధాలు ఒకసారి తిరిగేయండి.

యాగంటి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్

యాగంటి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ప్రాధాన్యత కలది. శివరాత్రి పర్వదినాన రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడున్న శివుని అనుగ్రహం కొరకు వస్తుంటారు. ఈ ఆలయాన్ని 15 వ శతాబ్ధానికి చెందిన, మొట్టమొదటి విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయలు కట్టించినాడు. ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకొన్నది పుష్కరణి, దీనినే ఆగస్త్య పుష్కరణి అంటారు. భారత దేశం మొత్తం మీద మీరు ఏ ప్రాంతంలో చూసిన పురాతన దేవాలయాలలో కొలనులు తప్పకుండా ఉంటాయి. పుష్కరణి లో నీళ్ళు మీరు ఏ మాసంలో చూసిన ఒకేవిధంగా ఉంటాయి. ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుందో, ఎలా కొండ చివరి భాగం వరకు పోతుందో ఎవ్వరికీ తెలీదు. కొండమీద నుంచి వచ్చే నీళ్ళు ఎల్లప్పుడూ తాజాగా, తియ్యగా ఉంటుంది. ఇక్కడున్న మరో వింత నంది విగ్రహం ఏటేటా పెరగడం.

Photo Courtesy: Suresh Kumar

సోమనాథ ఆలయం, గుజరాత్

సోమనాథ ఆలయం, గుజరాత్

సోమనాథ ఆలయాన్ని 11 వ శతాబ్ధంలో కట్టినారు. ప్రస్తుత కట్టడాన్ని 1951 వ సంవత్సరంలో పునర్నిర్మించినారు. ఈ ఆలయ చరిత్ర గురించి మీరు చదివే ఉంటారు. ఈ ఆలయ సంపద కోసం చాలానే యుద్ధాలు జరిగాయి అంటే లక్ష్యం రాజ్యం కాదు సంపద అన్నమాట. 17 సార్లు నాశనం చేయబడ్డ ఈ ఆలయం తరువాత జరిగిన పునర్నిర్మాణంతో పురాతన శోభను సంతరించుకుంది. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయ లింగాన్ని ప్రతిష్టించడం. ఆలయం మధ్యభాగంలో భూమిలోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం ఒక ప్రత్యేకత. చంద్రగ్రహణ కాలంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడకి రావడం ఆనవాయితీ.

Photo Courtesy: Jagadip Singh

హాజరాత్ శర్‌ఫుద్దీన్ షా విలయత్, ఆమ్రోహా, ఉత్తరప్రదేశ్

హాజరాత్ శర్‌ఫుద్దీన్ షా విలయత్, ఆమ్రోహా, ఉత్తరప్రదేశ్

హాజరాత్ శర్‌ఫుద్దీన్ షా విలయత్, ఇరాన్ నుండి భారతదేశానికి వచ్చిన పుణ్యాత్ముడు. ఈయన సన్నిధి (ఆలయం) మొత్తం నల్లని తేళ్ళతో నిండి ఉంటుంది. ఈ తేళ్ళు హానికరమైనవి కావు, అంతే కాదు చేయి మీద కూడా పాకించుకోవచ్చు ఇవి మీ మీద ఎటువంటి దాడి చేయవు. మామూలుగా ఈ నల్లని జాతులకి చెందిన కొన్ని తేళ్ళు (ఇవి కావు) కుడితే నొప్పి ఉంటుంది ఒక్కోసారి మరణం సంభవించవచ్చు. భక్తులు ఈ నల్లని తేళ్ళను ఆలయ సిబ్బంది అనుమతి ద్వారా ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. గమనిక తీసుకొని వెళ్ళేటప్పుడు తిరిగొచ్చే తేదీ చెప్పి తీసుకొని వెళ్ళాలి. ఆలయం నుండి బయటకు తీసుకొని మీ ఇంటికి వెళ్ళినా కూడా ఇవి కుట్టవు కానీ దీనిని మీరు తీసుకొని వెళ్ళి , రిటర్న్ తేదీ లోపుఆలయంలో పెట్టకపోతే ఇవి మిమ్మల్ని కుడతాయి.

Photo Courtesy: Abdullah Mukarram / NADEEM NAQVI

విఠల ఆలయం, హంపి

విఠల ఆలయం, హంపి

విఠల ఆలయం కర్నాటక రాష్ట్రం లోని హంపి లో ఉన్నది. హంపిని వరల్డ్ హెరిటేజ్ సైట్ అని మరియు శిధిలాల నగరం అని అంటారు. హంపి నగరాన్ని ధనిక రాజవంశాలలో ఒకరైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన విజయనగర రాజులు నిర్మించినారు. ఈ రాజ్యం సిరిసంపదలతో దీవించబడ్డది కనుక రాజులు అనేకానేక కట్టడాలు నిర్మించడానికి నడుంబిగించారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది విఠల ఆలయం. అలంకరించబడిన చెక్కడాలు, స్థంబాలు గల ఈ ఆలయంలో మీరు చూడవలసినది రంగ మండపంలోని మ్యూజికల్ స్థంబాలు. వాటిని ముట్టుకుంటే చాలు ఇప్పటికీ స రి గ మ ప ద ని అంటూ సంగీతం వినిపిస్తుంది. ఇదే ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించి, మన్నలలను పొందింది. ఇది ఆనాటి శిల్పకళా చాతుర్యానికి కలికితురాయి.

Photo Courtesy: Neeti Rishi

కమర్ అలీ దర్వేష్ దర్గా, పూణే

కమర్ అలీ దర్వేష్ దర్గా, పూణే

ఈ దర్గా మహారాష్ట్ర రాష్ట్రం లోని పూణే నగరానికి 19 కి. మీ. దూరంలో ఉన్న శివ్‌పూర్ గ్రామంలో ఉన్నది. ఇక్కడ ముస్లీం ల వేడుక ఉరుస్ అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకుంటారు. ఈ దర్గా లో 70 కేజీల బరువున్న ఒక బండరాయి ఉంది. ఈ రాయిని వచ్చిన భక్తులు అవలీలగా పైకి ఎత్తుతుంటారు. విసిరితే గాలి మధ్యలో సులభంగా తేలుతుంది. ఈ రాయిని ఇంత సులభంగా ఎలా పైకి ఎత్తగలమో ఇప్పటికీ తెలియదు.

Photo Courtesy: Kamal Khan abkamalkhan

అంబ సాహిబ్ గురుద్వారా , మొహాలి

అంబ సాహిబ్ గురుద్వారా , మొహాలి

అంబ సాహిబ్ గురుద్వారా, పంజాబ్ రాష్ట్రం లోని మొహాలి లో ఉన్నది. 7 వ సిక్కు గురువు గురు హర రాయ్ జి, తన ముత్తాత గురు అర్జన్ దేవ్ జి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ గురుద్వారా ప్రదేశాన్ని సందర్శించి భక్తులకు దీవెనలను ప్రసాదించినాడు. వచ్చే ... వచ్చే ... మిస్టరీ ఏ కదా ..! ఇక్కడున్న మిస్టరీయే మామిడి చెట్టు. ఈ చెట్టు సంవత్సరం పొడవునా తియ్యని మామిడి పండ్లను ఇస్తుంది. సిక్కు గురువు ఇచ్చిన దీవెనల ఫలితంగా ఇక్కడున్న ఈ చెట్టు సంవత్సరం లోని 365 రోజులు ఫలాన్ని భక్తులకి ప్రసాదిస్తుంది.

Photo Courtesy: telugu native planet

వీరభద్ర ఆలయం , లేపాక్షి

వీరభద్ర ఆలయం , లేపాక్షి

వీరభద్ర ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో ఉన్నది. పూర్తిగా విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలి లో జరిగిన ఈ ఆలయం లోని భారీ స్తంభాలు, గోడలపై చెక్కబడిన శిల్పాల నిర్మాణం ఇటు పర్యాటకులను, అటు చరిత్రకారులను అబ్బురాపరుస్తున్నాయి. సుమారు 70 స్థంబాలు ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ఒకేఒక్క స్తంభం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందరూ ఆ స్తంభం వైపే పరుగులు పెడుతుంటారు. ఇంతకి ఈ స్తంభం ప్రత్యేకత ఏమిటో చెప్పలేదు కదూ ..! నేలకు, స్తంభానికి ఖాళీ ఉంటుంది. ఈ మధ్యలోనుంచి పేపర్లు, దారం, బట్టలను ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపునుంచి బైటికి వస్తుంటాయి. అంత బరువైన ఈ స్తంభం ఎలా వేలాడదీసారో ఎవ్వరికీ అర్థం కాదు. అదీగాక ఇన్ని శతాబ్దాలుగా ఆ స్తంభం అలాగే వేలాడుతూ ఉండటం మరొక విచిత్రం.

Photo Courtesy: Jayanth M

తెప్పేరుమనళ్ళూర్, తమిళనాడు

తెప్పేరుమనళ్ళూర్, తమిళనాడు

తమిళనాడు లోని తెప్పేరుమనళ్ళూర్ వద్ద ఉన్న శివాలయంకి భక్తులు తరచూ వస్తుంటారు. ఇక్కడ 2010 వ సంవత్సరంలో భక్తులు ఒక అద్భుత సంఘటన చూశారు అదేమిటంటే ఆలయ పూజారి రోజువారీ కార్యక్రమాలను చేసుకుంటుంటే ఒక పాము తన నోటిలో ఆకును పట్టుకొని వచ్చి శివుని విగ్రహం మీద పెట్టింది. అది చూసి భక్తులు, ఆలయ పూజారి నివ్వెరపోయారు.

Photo Courtesy: tamilnadu temples

బృహదేశ్వర దేవాలయం , తంజావూర్

బృహదేశ్వర దేవాలయం , తంజావూర్

తంజావూర్ లోనే కాదు... దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ముద్రపడ్డ బృహదేశ్వరాలయం, శిల్పకళలకూ సాంస్కృతిక చారిత్రక ప్రాభవానికి ప్రతీకగా నిలిచింది. మందపాటి పునాదులతో.. ఎతైన స్తంభాలతో.. మరింత ఎతైన గోపురాలతో.. అలరారే ఈ ఆలయం నిత్యం ధూప దీప నైవేద్యాలతో.. భక్తుల శివనామ స్మరణతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మనకు తెలియని ఒక రహస్యం దాగి ఉంది అది ఏమిటంటే- గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు' కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా.. ఇప్పటికీ వీడని మిస్టరీ గానే మిగిలింది.

Photo Courtesy:Amit Rawat

గజేంద్ర ఘడ్ - గడగ్ , కర్నాటక

గజేంద్ర ఘడ్ - గడగ్ , కర్నాటక

ఉత్తర కర్నాటక జిల్లా అయిన గడగ్ లోని గజేంద్ర ఘడ్ లోని ఆలయాన్ని దక్షిణ కాశి అని పిలుస్తారు. అతి పెద్ద వరుసల మెట్లు మిమ్ములను కొండపై గల టెంపుల్ కు చేరుస్తాయి. గుడికి సమీపంలో వెలుపలి వైపుగా నిరంతరం నీరు వుండే ఒక కొలను లేదా దిగుడు బావి ఉంది. ఈ నీరు ఎక్కడనుండి ప్రవహిస్తుంది అనేది ఒక మిస్టరీ. పక్కనే కల ఒక రావి చెట్టు నుండి నీటి బిందువులు నిరంతరం కొలనులోకి పడుతూంటాయి.ఇక అసలు మిస్టరీ లోకి వస్తే.... ప్రతి సంవత్సరం వచ్చే కన్నడ ఉగాది పండుగ ముందు రోజు టెంపుల్ పూజారి తన డ్యూటీ గా ఒక హుక్కా మరియు కొంత సున్నపు నీరు అక్కడ వుంచుతాడు. మరుసటి రోజు ఉదయం చూస్తె, ఎవరికీ అర్ధం కాని రీతిలో టెంపుల్ గోడల లోపలి భాగం అంతా సున్నం వేయబడి వుంటుంది. దీని పట్ల కొంత మంది ఆసక్తి చూపిన అంతు పట్టలేదు. ఒకప్పుడు ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో ఒక పెద్ద గంటను ఒక కుంగ్ ఫు చేసే వ్యక్తి బలంగా మోదగా, ఆ గంట అప్పటి వరకూ ఎవరూ విననంత శబ్దంతో గంటలు కొడుతూ గాలిలోకి లేచి మాయం అయిపోయినదని చెపుతారు. ఆ గంట ఆ ప్రదేశం నుండి మాయం అయిన తర్వాత ఆ గ్రామంలో ప్లేగు వ్యాధి వచ్చిందని చెపుతారు.

Photo Courtesy: gulambro

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి