» »ఖమ్మం జిల్లా - పర్యాటక ప్రదేశాలు !!

ఖమ్మం జిల్లా - పర్యాటక ప్రదేశాలు !!

Written By:

ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా. ఈ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తే ... మరికొన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు సంపాదించాయి. ఈ జిల్లా ముఖ్యకేంద్రం అదేపేరుతో ఉన్న ఖమ్మం పట్టణం. ఇక్కడికి హైదరాబాద్, వరంగల్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి బస్సులు కలవు. మీరు ఖమ్మం జిల్లా చేరుకుంటే చాలు ... అక్కడి నుండి జిల్లాలోని అన్ని ముఖ్య పర్యాటక స్థలాలను సులభంగా చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భద్రాచలం ఈ జిల్లాలోనిదే.

ఇది కూడా చదవండి : వరంగల్ - చరిత్ర, కట్టడాలు మరియు సహజ ఆకర్షణలు కలిసే ప్రదేశం !

చరిత్ర

చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసింహాలయము నుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంబాధ్రిగా పిలువబడినట్టు తెలుస్తుంది. ఉర్దూ భాషలో కంబ అనగా రాతి స్తంభము కావున ఖమ్మం అను పేరు ఆ పట్టణములో కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. ఖమ్మం లో కల నరసింహాలయం త్రేతాయుగము నాటిదని నమ్మకం.

ఖమ్మం జిల్లాలో మరియు దాని చుట్టుప్రక్కల చూడవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాలు ఒకేసారి పరిశీలిస్తే ....

ఇది కూడా చదవండి : రాముడు నడియాడిన ... రామగిరి దుర్గం !

ఖమ్మం కోట / ఖమ్మం ఖిల్లా

ఖమ్మం కోట / ఖమ్మం ఖిల్లా

ఇది ఆంద్ర ప్రదేశ్ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం ఖమ్మం కోట. దీనిని క్రీ.శ. 950 లో కాకతీయుల కాలంలో పునాదులు పడ్డాయని, రెడ్డి, వెలమ రాజులు ఆతర్వాత వచ్చిన కుతుబ్ షాహి వంశస్తులు కోటకు మెరుగులు దిద్దారని తెలుస్తోంది. ఈ కోట స్థంభాద్రి అనే కొండపై కలదు.

చిత్రకృప : Shashank.u

జమలాపురం ఆలయం

జమలాపురం ఆలయం

జమలాపురం ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అంటారు. అనేక శతాబ్దాల క్రితం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో ప్రార్ధన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

చిత్రకృప : Pranayraj1985

లక్ష్మీ నరసింహ ఆలయం

లక్ష్మీ నరసింహ ఆలయం

లక్ష్మీ నరసింహ ఆలయం ఖమ్మం నుండి కేవలం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఖమ్మంలో, నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో ఖ్యాతి పొందింది. అన్ని రోజుల్లో ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఈ కారణంగా, అనేక మంది ప్రతి రోజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

చిత్రకృప : Adityamadhav83

పలైర్ సరస్సు

పలైర్ సరస్సు

ఈ సరస్సు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండల౦లో ఉన్న పలైర్ గ్రామంలో భాగం. ప్రధాన నగరం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సుని రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. పలైర్ సరస్సుకు చాలా దగ్గరలో ఉన్న వైరా సరస్సు మరొక మంచి విహార స్థలం.

చిత్రకృప : Pranayraj1985

వైరా పర్యాటక కేంద్రం

వైరా పర్యాటక కేంద్రం

వైరాలోని రిజర్వాయర్‌ గుట్టలపై పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రెస్టారెంట్లు, బోటింగ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్నారులు ఆడుకొనేందుకు ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఎంట్రీప్లాజా, లైటింగ్‌ సౌకర్యం ఉంది. పచ్చదరం, మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి.

చిత్రకృప : Adityamadhav83

పాపి కొండలు

పాపి కొండలు

ఖమ్మంలోని మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. పాపి కొండల పర్వత శ్రేణులు మునివాటం అనే అందమైన జలపాతాలకు చాలా ప్రసిద్దమైనవి. చాలామంది ప్రకృతితో మమేకం అవడానికి ఈ జలపాతాలు సందర్శిస్తారు.

చిత్రకృప : Dineshthatti

విహారయాత్ర

విహారయాత్ర

160 కి.మీ. 12 గంటలు నౌకా విహారం ఈ ప్రయాణంలో ప్రత్యేకత. జాతీయ స్థాయిలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన అంశం కూడా ఇదే. భద్రాచలం నుంచి పేరంటాలపల్లికి వెళ్లగలిగితే అక్కడి నుంచి పర్యాటకులను పాపికొండల యాత్రకు తీసుకెళ్లేందుకు లాంచీలు సిద్ధంగా ఉంటాయి.

చిత్రకృప : kiran kumar

భద్రాచలం

భద్రాచలం

ఈ ప్రాంతం శ్రీరాముడు మరియు ఆయన సాధ్వి సీతా నివసించిన ప్రదేశం గా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినది. ఇది శ్రీరాముడు నివసించిన ప్రదేశం కనుక హిందూ యాత్రికులు దీనిని ఎంతో పవిత్ర భూమిగా భావిస్తారు. రాముడి భక్తులకు అయోధ్య తర్వాత భద్రాచలం రెండవ స్థలం గా భావిస్తారు. ఖమ్మం నుండి భద్రాచలం 120 కిలోమీటర్లు.

చిత్రకృప : Pranayraj1985

పర్ణశాల

పర్ణశాల

భద్రాచలం పట్టణం నుంచి 36 కి.మీ. దూరంలో ఉన్న పర్ణశాలలో రామాయణ కాలం నాటి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. మారీచుడుని వధించిన స్థలంగా పేర్కొంటారు. బంగారు లేడి ఉదంతం జరిగిన ప్రదేశం కూడా ఇదేననే ప్రచారం ఉంది.

చిత్రకృప : Adityamadhav83

కిన్నెరసాని అభయారణ్యం

కిన్నెరసాని అభయారణ్యం

భద్రాచలం పట్టణం నుంచి 35 కి.మీ. దూరంలో.. కొత్తగూడెం నుంచి 24 కి.మీ. దూరంలో కిన్నెరసాని అభయారణ్యం ఉంది. కిన్నెరసాని డ్యామ్‌, రిజర్వాయర్‌ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ జింకల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని రిజర్వాయర్‌ మొసళ్లకు ప్రసిద్ధి.

చిత్రకృప : J.M.Garg

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

అన్నపురెడ్డిపల్లి దేవాలయం

ఖమ్మం పట్టణం నుంచి 75 కి.మీ. దూరంలో చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 700 సంవత్సరాల పురాతన దేవాలయం... పక్కనే ఉన్న అడవి ప్రాంతం... దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Adityamadhav83

నేలకొండపల్లి బౌద్ధస్తూపం

నేలకొండపల్లి బౌద్ధస్తూపం

ఖమ్మం పట్టణం నుంచి 21 కి.మీ. దూరంలో ఉన్న నేలకొండపల్లి గ్రామంలో బౌద్ధస్తూపం ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్తూపం పరిసరాలు ఆక్రమించి ఉండడం విశేషం. దీనినే బౌద్ధులు మహాస్తూపంగా వ్యవహరిస్తారు.

చిత్రకృప : Moinuddin10888

కూసుమంచి శివాలయం

కూసుమంచి శివాలయం

ఖమ్మం పట్టణం నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడిగా దీనికి పేరుంది.

చిత్రకృప : Pranayraj1985

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం

దుమ్ముగూడెం గ్రామం భద్రాచలానికి సుమారు 25 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం 'కాకర కాయ' ఆకారం లో ఒక చిన్న ద్వీపం గా వుంటుంది. ఈ ప్రదేశ ప్రజలు రాముడి అవతారమైన ఆత్మా రాముడిని పూజిస్తారు. ఈ ద్వీపం 100 సంవత్సరాల నాటి బలమైన బ్రిడ్జి తో ప్రధాన భూభాగానికి కలుపబడింది.

చిత్రకృప : Adityamadhav83

జటాయు పాక

జటాయు పాక

జటాయు పాక ప్రదేశాన్ని ఏట పాక అని కూడా అంటారు. ఇది భద్రాచలానికి 2 కి.మీ.ల దూరం లో కలదు. ఇక్కడే జటాయువు సీతను అపహరించుకొని వెళుతుంటే అడ్డుకొని ప్రాణాలు కోల్పోయాడని చెబుతారు. ఈ ప్రదేశం కూడా భక్తులచే ఆకర్షించ బడుతున్నది.

గుణదల

గుణదల

ఇక్కడి ప్రధాన ఆకర్షణ వేడినీటి బుగ్గలు. శీతాకాలంలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతారు. ఈ బుగ్గలలో స్నానాలు చేస్తే వ్యాధులు పోతాయని, మానసిక రుగ్మతలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇది ఖమ్మం కు 5 కి.మీ. ల దూరంలో కలదు.

చిత్రకృప : Pranayraj1985

బోగత జలపాతం

బోగత జలపాతం

బోగత జలపాతం ఖమ్మం జిల్లా, వాజేడు మండలంలోని బోగత గ్రామంలో ఈ జలపాతం ఉంది. దీన్ని చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య, కొండకోనల నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన జలపాతం ఇది. భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బోగత జలపాతం.

చిత్రకృప : Telangana forest Department

ఖమ్మం ఎలా చేరుకోవాలి ??

ఖమ్మం ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం : ఖమ్మం పట్టణానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 228 కిలోమీటర్ల దూరంలో, గన్నవరం దేశీయ విమానాశ్రయం 145 కిలోమీటర్ల దూరంలో కలదు.

రైలు మార్గం : ఖమ్మంలో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.

రోడ్డు మార్గం : హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నల్గొండ తదితర ప్రాంతాల నుండి ఖమ్మం కు పప్రభుత్వ బస్సులు తిరుగుతాయి.

చిత్రకృప : Pranayraj1985

Please Wait while comments are loading...