» »ఎత్తిపోతల జలపాతము, గుంటూరు జిల్లా !!

ఎత్తిపోతల జలపాతము, గుంటూరు జిల్లా !!

Written By:

జలపాతం పేరు : ఎత్తిపోతల జలపాతం
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
జిల్లా : గుంటూరు
సమీప పట్టణం : మాచెర్ల


ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉంది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణా నదిలో కలుస్తున్నది.ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.

యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.

ఎత్తిపోతల జలపాతము

                                               చిత్రకృప : MPRAVEEN337

ఆలయాలు

ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే.

ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు.

ఎత్తిపోతల జలపాతము

                                                చిత్రకృప : Abhinaba Basu

మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబునగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. వసతికై ఎపి టూరిజం సంస్థ వారి పున్నమి అథిగృహం ఇక్కడ ఉంది.

మాచెర్ల చెన్నకేశవ ఆలయం

మాచెర్ల గుంటూరు కు 110 కిలోమీటర్ల దూరంలో, నాగార్జున సాగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఈ పట్టణము హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయమునకు ప్రసిద్ధి. పురాతన కాలములో దీనిని 'మహాదేవిచర్ల' అని పిలిచేవారు. ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవము చాలా ఘనముగా నిర్వహింపబడును మరియు ఆ సమయములో ఇక్కడికి చాలా దూరమునుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయము 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయము ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభము చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.

మాచెర్ల చెన్నకేశవ ఆలయం

                                                   చిత్రకృప : డా.పి.మురళీ కృష్ణ

మాచర్ల లో సందర్శించవలసిన ప్రదేశాలు

వీరభద్ర స్వామి దేవాలయం, రాముల వారి ఆలయం, రామప్ప గుడి, ఓటిగుళ్ళు, వెంకటేశ్వర స్వామి గుడి, ఆదిలక్ష్మమ్మ ఆలయం, వినాయక దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం మొదలగునవి చూడవచ్చు.

ఎత్తిపోతల జలపాతానికి ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం : ఎత్తిపోతల జలపాతానికి చేరుకోవటానికి రెండు విమానాశ్రయాలు దగ్గరలో ఉన్నాయి. అవి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం విమానాశ్రయం.

సమీప రైల్వే స్టేషన్లు : జలపాతానికి దగ్గరలో మూడు రైల్వే స్టేషన్ ఉన్నాయి. విష్ణుపురం, పొందుగుల, నడికుడి. వీటిలో నడికుడి జంక్షన్. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఇక్కడ ఆగుతాయి.

రోడ్డు మార్గం : ఎత్తిపోతల జలపాతానికి చేరుకోవటానికి హైదరాబాద్, నల్గొండ, నాగార్జున సాగర్, గుంటూరు తదితర ప్రాంతాల నుండి బస్సులు తిరుగుతుంటాయి. మాచర్ల నుండి జీపులు, ఆటోలు ఎక్కి జలపాతం చేరుకోవచ్చు.

Please Wait while comments are loading...