• Follow NativePlanet
Share
» »ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?

ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?

Posted By: Staff

అన్నం, పరబ్రహ్మ స్వరూపం అనే తెలుగు నానుడి. తెలుగింటి వంటలోని ప్రధాన ఆహార వస్తువు ఏమిటో చెప్పకనే చెబుతుంది! ఆంధ్ర ప్రదేశ్ కే ప్రత్యేకం కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాలలో తెలుగు వంటలు నోరూరిస్తుంటాయి. వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి.

శాకాహారమయినా, మాంసాహారమయినా లేక చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏ ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు మరియు చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకత ను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికే చెల్లయింది. తెలంగాణ ప్రాంతంలో సజ్జ రొట్టెలని ఎక్కువగా తింటారు. కోస్తా, రాయలసీమ లలో అన్నం వినియోగం ఎక్కువ.

కోస్తాంధ్ర

కోస్తాంధ్ర

కృష్ణ మరియు గోదావరి పరివాహక ప్రాంతము మరియు బంగాళాఖాతాన్ని ఆనుకొన్న ప్రదేశం అవ్వటం మూలాన ఈ ప్రదేశం లో వరి, ఎండుమిరప లు పండుతాయి. అందుకే అన్నం, పప్పు మరియు సముద్రాహారాలు ఇక్కడి ప్రజల ప్రధానాహారం. ఇతర ప్రాంతీయ వంటకాలున్ననూ అన్నం మాత్రం ప్రధానాహారం.ఇక్కడి వంటకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, బెంగుళూరు, చెన్నై మరియు న్యూఢిల్లీ లలో కూడా ప్రశస్తి పొందాయి.

Photo Courtesy: ramesh agarwal

ఉత్తరాంధ్ర - అల్పాహారం

ఉత్తరాంధ్ర - అల్పాహారం

పూరి, పటోలి లు ఇక్కడి వారి అభిమాన అల్పాహారం. ఉప్పిండి లోనూ, అన్నం లోనూ ఇంగువ చారు ని తింటారు. బియ్యపు పిండి, బెల్లం, మొక్కజొన్న గింజలు ఉల్లిపాయలతో బెల్లం పులుసు ని చేస్తారు.

Photo Courtesy: Madhumita Mukerje

ఉత్తరాంధ్ర - భోజనం

ఉత్తరాంధ్ర - భోజనం

ఒరిస్సాని ఆనుకొని ఉన్న మూడు జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం ని కలిపి ఉత్తరాంధ్ర (లేదా కళింగాంధ్ర) గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంత ప్రజలు సాధారణ వంటలలో కూడా తీపిని ఇష్టపడతారు. రోజూ తినే పప్పులో బెల్లం వినియోగిస్తారు. దీనినే బెల్లం పప్పు గా వ్యవహరిస్తారు. ఈ పప్పుని, అన్నంలో వెన్నని కలుపుకు తింటారు.

Photo Courtesy: Chris Brunn

ఉత్తరాంధ్ర - ఊరగాయలు

ఉత్తరాంధ్ర - ఊరగాయలు

మెంతులని ఉపయోగించి మెంతిపెట్టిన కూర, ఆవాలని ఉపయోగించి ఆవపెట్టిన కూర మరియు నువ్వులని ఉపయోగించి నువ్వుగుండు కూర లని తయారు చేస్తారు. కూరగాయలు, మొక్కజొన్న గింజలని ఉల్లిపాయలతో కలిపి ఉల్లికారం చేస్తారు.

Photo Courtesy: Vahchef Vahrehvah.com

గోదావరి జిల్లాలు - కాజా

గోదావరి జిల్లాలు - కాజా

తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం లో తయారయ్యే తాపేశ్వరం కాజా ప్రపంచ ప్రసిద్ధి చెందినది. అంతే కాదు కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ది. కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు మరియు శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ద మిఠాయి.

Photo Courtesy: Bujji

గోదావరి జిల్లాలు - పూతరేకులు

గోదావరి జిల్లాలు - పూతరేకులు

పూతరేకులు ఆంధ్రప్రాంత అత్యంత ప్రసిద్ద మిఠాయిలు. పూతరేకులు చేయుట అనేది కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. తూర్పుగోదావరిలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిదంగా తెలియక పోయినా పూతరేకుల పరంగా ఈ మండలం బహు ప్రసిద్దం. ఈ మండల పరిధిలోని గ్రామాలు పూతరేకుల తయారీతో కళ కళలాడుతుంటాయి.

Photo Courtesy: Shyams Hospitality

ఒంగోలు - మైసూర్ పాక్

ఒంగోలు - మైసూర్ పాక్

ఒంగోలు కి చెందిన అల్లూరయ్య నేతి మిఠాయిలు ప్రశస్తి. ఇక్కడ అన్ని రకాల మిఠాయిలు చేయబడిననూ, సుతిమెత్తగా, నోట్లో వేసుకొనగనే కరిగిపోవు మైసూరుపాక్ని జనం బాగా ఇష్టపడతారు.

Photo Courtesy: Bujji

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు చేపల పులుసుకి చాలా ప్రసిద్ది. రుచి, రంగు, సువాసనకు పెట్టింది పేరు అంటారు. రాష్ట్రమంతటా నెల్లూరు వారి భోజనశాలలను విరివిగా చూడవచ్చును.

Photo Courtesy: Vinay Kudithipudi

రాయలసీమ - వగ్గాని బజ్జీ

రాయలసీమ - వగ్గాని బజ్జీ

బొరుగులు (మరమరాలతో చేసే టిఫిన్) సీమ ప్రత్యేకత. వీటిలోకి బజ్జీలు నంజుకొని తింటే ఉంటుంది ... ఆహా..ఒహో!ఒక్క చిత్తూరు జిల్లా మినహా, మిగతా మూడు జిల్లాల లో దీనిని చేస్తారు. ఇది హోటళ్ళ లో కూడా లభ్యం. అయితే ఒక్కో జిల్లాలో దీనికి ఒక్కో పేరు ఉంది. కర్నూలు లో బొరుగుల తిరగవాతగా, అనంతపురంలో ఉగ్గాని గా, కడప లో బొరుగుల చిత్రాన్నం గా పిలుస్తారు.

Photo Courtesy: Veera Sasidhar Jangam

రాయలసీమ - రొట్టెలు

రాయలసీమ - రొట్టెలు

జొన్న రొట్టె లను చిత్తూరును మినహాయించి మూడు జిల్లాల్లోనూ తింటారు. షుగర్ ఉన్నవారికి ఇది మంచి విరిగుడు. అప్పుడెప్పుడో నేను చదువుకునే రోజుల్లో నంద్యాల పట్టణంలో ప్రస్తుత ఎంపి ఎస్.పి.వై.రెడ్డి రూపాయకే రొట్టె - పప్పు ఇస్తుండేవాడు. భలే రుచిగా ఉంటుడే ఆ రోజుల్లో తింటుంటే!

Photo Courtesy:Vahchef Vahrehvah.com

రాయలసీమ - కడప

రాయలసీమ - కడప

రాగిసంగటి కడప లో బాగా తింటారు. వీటి కోసం ప్రత్యేకంగా హోటళ్ళను జిల్లాలో చాల విరివిగా చూడవచ్చు. మిగతా మూడు జిల్లాల్లో కంటే కడపలోనే ఎక్కువగా తింటారు ఈ రాగి సంకటిని! దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రాగి సంకటి ని భలే ఇష్టంగా తినేవారు. అందులోకి నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఉంటుంది అబ్బో... ఈ మధ్యనే పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళలో దీనిని ప్రవేశపెట్టారు.

Photo Courtesy: cherukuriprasad

రాయలసీమ - చిత్తూరు

రాయలసీమ - చిత్తూరు

పొంగలి చిత్తూరు లో బాగా ఎక్కువ. చాలా మంది తెలంగాణా వాసులకి పొంగలి తెలియదు. అయితే తమిళనాడు పొంగలి ఇక్కడి పొంగలి ఒకటే విధంగా ఉంటాయి.

Photo Courtesy: Bujji

చిత్తూరు - వగరు పులుపులు సాంబారు

చిత్తూరు - వగరు పులుపులు సాంబారు

ఇడ్లీల తయారీలో చిత్తూరు జిల్లా వారు ఇడ్లీ రవ్వకు బదులుగా ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఇడ్లీ, దోసె లలో చిత్తూరు జిల్లా వారు పచ్చడి, సాంబారు లే కాకుండా మాంసాహార పులుసు కూరలని తింటారు. సాంబారు లో ఇతర కూరగాయ ముక్కలతో బాటుగా చిత్తూరు లో మామిడికాయని కూడా వేస్తారు. ఇది వేస్తే వగరు - పులుపులు కలవటంతో సాంబారు మరింత రుచికరంగా ఉంటుందట !

Photo Courtesy: Food for art

రాయలసీమ - బనగానెపల్లె

రాయలసీమ - బనగానెపల్లె

బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది.

Photo Courtesy: Parshotam Lal Tandon

రాయలసీమ - పులిహోర

రాయలసీమ - పులిహోర

పులిహోర ని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో చిత్రాన్నం అని అంటారు. చిత్తూరు జిల్లాలో పులుసన్నం అని అంటారు (నిమ్మకాయ పులుసు, చింతపండు పులుసు లతో చేస్తారని అలా పిలుస్తారులెండి).

Photo Courtesy: Vahchef Vahrehvah.com

రాయలసీమ - భక్ష్యాలు

రాయలసీమ - భక్ష్యాలు

బొబ్బట్లని కర్నూలు లో భక్ష్యాలు అనీ, మిగతా జిల్లాలలో పోళిగ/ఓళిగలనీ అంటారు. అయితే కర్నూలు లో వీటి తయారీలో మైదా/గోధుమ పిండి కాకుండా పేనీ రవ్వని ఉపయోగిస్తారు. కర్నూలు అనంతపురం జిల్లాలలో వీటిని విక్రయించే ప్రత్యేక అంగళ్ళు ఉంటాయి.

Photo Courtesy: prathy27

రాయలసీమ - కాఫీ

రాయలసీమ - కాఫీ

సీమ లో కాఫీ ఎక్కువగా తాగుతారు. అయితే ఇప్పటి తరాలు ఉద్యోగరిత్యా పట్టణాలలో స్థిరపడటం వలన టీ కి కూడా కాస్త చోటు లభించింది. లేకపోతే కాఫీనే!

Photo Courtesy: Jessica Petersen

తెలంగాణ - బొబ్బడాలు

తెలంగాణ - బొబ్బడాలు

సాంబారు ని అచ్చు గుద్దినట్లు పోలి ఉండే పప్పుచారు తెలంగాణ ప్రాంతానికే పరిమితం. మజ్జిగ పులుసు లో ఇక్కడి వారు చిన్న చిన్న బజ్జీలని వేస్తారు. వీటిని బొబ్బడాలు అంటారు. ఈ బొబ్బడాలు పులుసు ఎంతగా నానుతాయో వాటికి అంత రుచి వస్తుంది. దాదాపు అన్ని వంటలలోనూ అల్లం-వెల్లుల్లి లని నూరి వేస్తారు. దీనినే ప్రాంతీయంగా అల్లం-ఎల్లిగడ్డ అని పిలుస్తుంటారు.

Photo Courtesy: potluck.meesai

తెలంగాణ - హైదరాబాద్

తెలంగాణ - హైదరాబాద్

హైదరాబాద్ బిర్యానీ కి ప్రసిద్ధి. అందునా చికెన్ బిర్యానీ కి పెట్టింది పేరు. హోటల్ ఏదైనా ఉందా అంటే ప్యారడైజ్ . సికింద్రాబాద్ లో ఉన్న ఈ హోటల్ లో బిర్యానీ రుచి మరెక్కడా రాదు. ఖరీదు కూడా చాలా చవకే కానీ కూర్చోవడానికి సీటు దొరకడం కష్టం .. అంత మంది జనం వస్తుంటారు ఇక్కడికి. మటన్ హలీం లు, ఇరానీ చాయ్ లు హైదరాబాదీ వంట ప్రత్యేకాలు. హలీమ్ రంజాన్ మాసంలో హైదరాబాద్ లోని చాలా చోట్ల లభిస్తుంది. పాత బస్తీ లోని ఇరానీ ఛాయ్, సమోస తినటం ఒక మాధురాను భూతి.

Photo Courtesy: lekha food

సంపూర్ణ తెలుగింటి భోజనం - శాకాహారములలో

సంపూర్ణ తెలుగింటి భోజనం - శాకాహారములలో

సంపూర్ణ ఆంధ్ర భోజనములో సహజంగా కలిగి ఉండేవి అన్నము, పప్పు, సాంబారు, రసం, ఊరగాయ, పులిహోర, అప్పడం మరియు వడియములు, ఒక కర్రీ ( వంకాయకూర, బెండకాయ ఇగురు, దొండకాయ వేపుడు మరేదైనా కావచ్చు) చివరగా పెరుగు. ఇదైతే నేను తిన్నాను కనుక చెబుతున్నాను. ఇంకొన్ని చోట్ల వీటితో పాటుగా కారంపొడి, మజ్జిగ పులుసు, మూనక్కాయల పులుసు కూడా వడ్డిస్తుంటారు.

Photo Courtesy: vsureshkamesh

 భోజనం - మాంశాహారములలో

భోజనం - మాంశాహారములలో

చేపల పులుసు, కోడి కూర, మేక మాంసము, రొయ్యల ఇగురు . వీటిని మనము అన్నం లో కానీ , జొన్న రొట్టెలలో గాని లేకుంటే సజ్జ రొట్టెలలో గాని తింటే భలే రుచికరంగా ఉంటుంది.

Photo Courtesy: Vahchef Vahrehvah.com

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి