Search
  • Follow NativePlanet
Share
» »నెల్లూరులో ఫ్యామిలీతో వెళ్లే ప్రదేశాలు !

నెల్లూరులో ఫ్యామిలీతో వెళ్లే ప్రదేశాలు !

By Venkatakarunasri

నెల్లూరు, దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బంగాళాఖాతం సముద్రపు తీర ప్రాంతమున గల ఒక జిల్లా. ఈ జిల్లా ను విక్రమసింహపురి జిల్లా అని మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పిలుస్తారు. ఈ జిల్లా పరిపాలన కేంద్రం నెల్లూరు పట్టణం. నెల్లూరు పట్టణం పెన్నా నది ఒడ్డున ఉన్నది. నెల్లూరు జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి ఎన్నో ప్రాచీన దేవాలయాలు మరియు కట్టడాలు ఉన్నాయి కనుకనే దీనిని ఆలయాల నగరం అని పిలుస్తారు. ఈ జిల్లాకు పశ్చిమాన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతి, దక్షిణాన చెన్నై మహానగరం, తూర్పున బంగాళాఖాత సముద్రం మరియు ఉత్తరాన ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

పూర్వం ఈ ప్రదేశం అశోకుని సామ్రాజ్యంలో ఉండేటిదట. ఆతరువాత పల్లవులు, తెలుగు చోళులు, శాతవాహనుల ఇంకా ఇతర రాజవంశీయుల ఆధీనంలో పరిపాలించబడినది. ఈ రాజవంశీయుల సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఇక్కడున్న అనేక ప్రాచీన కట్టడాలు, ఆలయాల శిల్ప శైలిలో కనపడుతుంది. విజయవాడ - చెన్నై జాతీయ రహదారి మార్గంలో ఉన్న నెల్లూరు వ్యాపార, వర్తకవాణిజ్య మరియు విద్యా రంగాలలో దూసుకుపోతున్నది. మరి ఎన్నో చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న నెల్లూరు నగరం మరియు దాని చుట్టుప్రక్కల గల ఇతర ప్రదేశాలలో సందర్శించవలసిన పిక్నిక్, టూరిస్ట్ స్పాట్ ల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే ...

శ్రీ రంగనాథస్వామి ఆలయం

శ్రీ రంగనాథస్వామి ఆలయం

నెల్లూరు నగరానికే ప్రధాన ఆకర్షణ శ్రీ రంగనాథస్వామి ఆలయం. ఈ దేవాలయంలో గల విష్ణుమూర్తిని రంగనాథునిగా పూజిస్తారు. ఈ దేవాలయానికి గల ఇతర పేర్లు : రంగనాయక టెంపుల్, తల్పగిరి రంగనాథస్వామి ఆలయం మరియు రంగనాయకుల దేవాలయం. ఈ దేవాలయాన్ని పల్లవులు పెన్నానది ఒడ్డున క్రీ.శ. 12 వ శతాబ్దంలో నిర్మించినారు. దీని గాలి గోపురం 70 అడుగుల ఎత్తు కలిగి, 10 బంగారు పూత గల పాత్రలని పై భాగంలో కలిగి ఉంటుంది. ఈ పాత్రలని కలసాలు అంటారు. నగరంలో ఎక్కడ నుంచైనా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy: YVSREDDY

నరసింహస్వామి ఆలయం

నరసింహస్వామి ఆలయం

నెల్లూరు లో తప్పక చూడవలసిన మరో ఆలయం నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం పట్టణానికి 13 కి.మీ. దూరంలో ప్రకృతి ఒడిలో అలరారుతుంది. దీనినే స్థానికులు వేదగిరి లక్ష్మి నరసింహస్వామి ఆలయం గా పిలుస్తారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి నాల్గవ అవతారం అయిన నరసింహస్వామిని పూజిస్తారు. ఈ ఆలయం పై భక్తులకు ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.

Photo Courtesy: Praveen Kaycee

రామలింగేశ్వర ఆలయం

రామలింగేశ్వర ఆలయం

నెల్లూరు నగరానికి 30 కి.మీ. దూరంలో ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని రామ తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఆయనకు తోడు కామాక్షమ్మ ఉంటుంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యేశ్వరుడు కూడా పూజింపబడతారు. బ్రిటీష్ వారి హయాంలో నిర్మించిన ఈ ఆలయం చక్కటి శిల్పకళతో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తున్నది.

Photo Courtesy: telugu native planet

అద్దాల మండపం

అద్దాల మండపం

అద్దాల మండపం రంగనాథస్వామి ఆలయం లోపల కలదు. చక్కటి పనితనంతో నిర్మించిన ఈ మండపం చాలా ప్రసిద్ధి చెందినది. భక్తులు ఈ మిర్రర్ హాల్ (అద్దాల హాలు) చూసి ఆనందపడతారు. అనేక అద్దాలలో భక్తులు శ్రీ రంగనాథున్ని చూసి భక్తితో పూజిస్తారు. కనుక రంగనాథ ఆలయాన్ని సందర్శించేవారు లోపల ఉన్న ఈ అద్దాల మండపాన్ని తప్పక సందర్శించండి.

Photo Courtesy: Rajesh kamisetty

పెంచల కోన

పెంచల కోన

తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాలలో నెల్లూరు - కడప జిల్లాల మధ్యలో పెంచల కోన అనే వైష్ణవ క్షేత్రం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. పెంచల కోన నెల్లూరు పట్టణానికి 80 కి. మీ. దూరంలో, సముద్రమట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉన్నది. కోనలోని గర్భగుడి సుమారుగా 700 సంవత్సరాల క్రితం కట్టించినట్లుగా చెబుతారు.

Photo Courtesy: YVSREDDY

జొన్నవాడ

జొన్నవాడ

నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం లో జొన్నవాడ అనే గ్రామం ఉంది. ఇక్కడ బ్రామరాంబమలికార్జున కామాక్షి మాత ఆలయం ఉంది. దీనిని స్వయముగా శ్రీ ఆది శంకరాచార్యులే ప్రతిష్టించాడని నానుడి. పిలిస్తే పలికే తల్లిగా, గ్రామ దేవతగా, ఆమ్మగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.

Photo Courtesy: nellore temples

సూళ్లూరుపేట

సూళ్లూరుపేట

చెన్నై నుండి 80 కి. మీ. దూరంలో, జిల్లా కేంద్రం నెల్లూరు నుండి 100 కి. మీ. దూరంలో ఉన్న సూళ్లూరుపేట లో చెంగాలమ్మ గుడి ప్రసిద్ధి చెందినది. తలపై నాగపడగ కలిగి ఎనిమిది చేతులతో ఉండే అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ సుళ్ళు ఉత్సవాన్ని భక్తి శ్రద్ధాల నడుమ జరుపుకుంటుంటారు. ఒక పెద్ద కర్రను తీసుకొని దానికి మేక ను కట్టి మూడుసార్లు తిప్పుతారు. దీనినే సుళ్ళు ఉత్సవం అని పిలుస్తారు. ఈ ఉత్సవాలకి నెల్లూరు ప్రజలే కాక తమిళనాడు ప్రజలు సైతం వస్తుంటారు.

Photo Courtesy: Sandeep Chillakuru

నర్రవాడ

నర్రవాడ

నర్రవాడ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన ఒక గ్రామం. ఇక్కడ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన వెంగమాంబ ఆలయం తో పాటు, శ్రీ జనార్ధనస్వామి వారి ఆలయం కూడా ఉంది. శ్రీ వెంగమాంబ పేరంటాళ్ల ఉత్సవాలు . రోజుల పాటు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్ర ప్రజలే కాక తమిళనాడు ప్రజలు, కర్నాటక ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

Photo Courtesy: nellore temples

గొలగమూడి

గొలగమూడి

నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రముఖ యాత్రా స్థలాలలో గొలగమూడి ప్రసిద్ది చెందినది. ఈ గ్రామం జిల్లా కేంద్రం నెల్లూరు పట్టణానికి 15 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి కొలువైన దైవము. ఇక్కడ వెంకయ్య అనే సిద్ధుడు నివశించి మహాసమాధి చెందినాడు. అప్పటి నుంచి వెంకయ్య స్వామి గా పూజలు అందుకుంటున్నాడు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. ఇక్కడ ఆగస్టు మాసంలో జరిగే ఆరాధన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.

Photo Courtesy: nellore.co.in

ఘటిక సిద్ధేశ్వరం

ఘటిక సిద్ధేశ్వరం

నెల్లూరు జిల్లాలో మరో పేరుమోసిన పుణ్య క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం. చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం నెల్లూరు కు 100 కి. మీ. దూరంలో ఉన్న సిద్ధేశ్వరకోన లో ఉంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టంగా అలుముకున్నా చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసు మైమరిపించేవిధంగా ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు నెల్లూరు ప్రజలే కాక చుట్టుప్రక్కల జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు.

Photo Courtesy: YVSREDDY

బుచ్చిరెడ్డిపాలెం

బుచ్చిరెడ్డిపాలెం

నెల్లూరు పట్టణానికి 15 కి. మీ. దూరంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం వ్యాపార మరియు వ్యవసాయ కేంద్రంగా ఉంది. ఇక్కడ వరి, చెరకు వంటి పంటలె కాక చేపలు మరియు రొయ్యల పెంపకం చేస్తుంటారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో శ్రీ కోదండరామస్వామి ఆలయం, సాయిబాబా గుడి, వినాయకుని గుడి, కన్యకాపరమేశ్వరి ఆలయం ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: Kodandaram

శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం

శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం

నెల్లూరు పట్టణంలో మూలాపేటలో ప్రఖ్యాతి గాంచిన పురాతన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయం క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందినది. శివరాత్రి రోజు ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగాన్ని పూజించి తమ కోరికలు విన్నవిస్తే అవి ఖచ్చితంగా ఫలిస్తాయని ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం.

Photo Courtesy: nellore temples

బారా షహీద్ దర్గా

బారా షహీద్ దర్గా

బారా షహీద్ దర్గా, నెల్లూరు జిల్లా సూళ్ళురుపేట వద్ద ఉన్నది. ఇక్కడ 12 మంది మృతవీరుల జ్ఞాపకార్థం ఈ దర్గాను నిర్మించారు. ఈ క్షేత్రం ముస్లిం లకు ఒక పవిత్ర యాత్ర స్థలంగా చెప్పుకోవచ్చు. ఈ దర్గాలో మోహర్రం ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తారు. ఇదే గాక అన్ని మతాల వారు కలిసి జరుపుకొనే మరో వేడుక రొట్టెల పండగ. ఈ పండగ ను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ వేడుకకు హాజరవటానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక, దేశం నలుమూలల నుంచి ముస్లిం భక్తులే కాక, అన్ని మతాల ప్రజలు భారీగా తరలివస్తుంటారు. మరో విశేషం ఈ దర్గా సముద్రానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

Photo Courtesy: Sumanthaks

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

నెల్లూరు కు సుమారు వంద మైళ్ళ దూరంలో ఉదయగిరి కోట ఉంది. ఈ దుర్గాన్ని చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులే కాక గోల్కొండ నవాబులు, కాకతీయుల రాజైన గణపతి దేవుడు సైతం పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముస్లిం రాజుల హయాం లో ఇక్కడ మసీదులు, హిందవుల రాజుల హయాంలో దేవాలయాలు, గోపురాలు మరియు చారిత్రక కట్టడాలు నిర్మించినారు. ఆతరువాత పరిపాలించిన బ్రిటీష్ వారు రాజమాహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించినారు. నెల్లూరు లో చూడవలసిన దుర్గాలలో ఉదయగిరి దుర్గం ప్రధానమైనది.

Photo Courtesy: Sravan Kumar

పల్లిపాడు

పల్లిపాడు

నెల్లూరు జిల్లాలో ఉన్న ఇందుకూరుపేట మండలానికి చెందిన పల్లిపాడు ఒక గ్రామము. ఇక్కడ గాంధీజీ ఆశ్రమం ఉంది. దీనినే సత్యాగ్రహ ఆశ్రమం అంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ఎందరో త్యాగధనులకు గుర్తుగా ఉంది.

Photo Courtesy: pallipadu.com

శ్రీహరికోట

శ్రీహరికోట

శ్రీహరికోట నెల్లూరు జిల్లా తీరప్రాంతపు ద్వీపం. ఇది బంగాళాఖాతంలో ఒక ద్వీపంగా ఉంది. ఇక్కడ సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉంది, దీనిని ఇస్రో వారు నిర్వహిస్తునారు. ఇక్కడ నుంచి భారతదేశం రాకెట్ లను అంతరిక్షాంలోకి పంపిస్తుంది. శ్రీరాముడు ఇక్కడ అరకోటి లింగాలను ప్రతిష్టించాడని, అందువల్ల రాక్షసుల ప్రభావం అంతరించిపోయిందని, అందువల్ల ఈ ప్రాంతాన్ని శ్రీ అరకోటై గా అభివర్ణించారు. ఆ పేరు కాస్త శ్రీహరికోట గా నిలిచిపోయింది.

Photo Courtesy: Arun Katiyar

మైపాడు బీచ్

మైపాడు బీచ్

మైపాడు బీచ్ నెల్లూరు కు 22 కి. మీ దూరంలో ఉండి, రోడ్డు మార్గాన సులభంగా చేరుకొనేవిధంగా ఉంటుంది. బీచ్ ప్రాంతమంతా హోటళ్లతో, రిసార్ట్ లతో నిండి ఉంటుంది. సాయంత్రం 6 అయ్యిండంటే చాలు ప్రజలు ఇక్కడి సూర్యాస్తమాన్ని తిలకించేందుకు వస్తుంటారు. బీచ్ ప్రాంతం అంతా అందంగా ఉండి, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని, ప్రశాంతతను ఇస్తున్నాయి.

Photo Courtesy: Satyendra Kumar

నేలపట్టు బర్డ్ సంక్చూరి

నేలపట్టు బర్డ్ సంక్చూరి

నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సుకు 20 కి. మీ. దూరంలో నేలపట్టు బర్డ్ సంక్చూరి కలదు. ఈ సంక్చూరి ఎన్నో రకాల అందమైన, అరుదైన పక్షులకు ఆవాసంగా ఉన్నది. ఈ సంక్చూరి ని చూడాలంటే అక్టోబర్ మరియు మార్చి నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయాలలోనే అనేక రకాల పక్షులు ఇక్కడికి వచ్చి నివాసాలను ఏర్పరుచుకుంటాయి.

Photo Courtesy: Balu Velachery

పులికాట్ సరస్సు

పులికాట్ సరస్సు

నెల్లూరు జిల్లాలో దేశంలోనే ప్రసిద్ధి చెందిన రెండవ పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు ఉన్నది. ఇది అరుదైన పక్షి జాతులకు నిలయంగా ఉంటూ వస్తుంది. ఇది పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశంగా ఉంది. రూ.500 తో బోట్ షికారు కూడా చేసుకోవచ్చు.

Photo Courtesy: McKay Savage

సోమశిల

సోమశిల

సోమశిల ప్రాంతం నెల్లూరు కు 75 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రధానంగా పర్యాటకులు చూడవలసినది రిజర్వాయర్. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రోడ్డు మార్గాన ఇక్కడికి బస్సుల ద్వారా కానీ, షేర్ ఆటో ల ద్వారా కానీ సులభంగా చేరుకోవచ్చు. పిల్లలకి, విద్యార్థులకి, పెద్దలకి ఇదొక చిన్న పిక్నిక్ ప్రదేశం గా ఆకర్షిస్తున్నది.

Photo Courtesy: bhaskar babu

వెంకటగిరి దుర్గం

వెంకటగిరి దుర్గం

దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని కొండల నడుమ వెంకటగిరి దుర్గం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ దుర్గం వెంకటగిరికి 17 మైళ్ళ దూరంలో ఉన్నది. దుర్గంలో గ్రామ దేవత అయిన కలివేలమ్మ ఆలయం ఉన్నది. చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి నగరాలనుంచి పర్యాటకులు, సాహసికులు మరియు విద్యార్థులు ట్రెక్కింగ్ కోసం వెంకటగిరి దుర్గానికి వస్తుంటారు.

Photo Courtesy: nellore forts

కృష్ణ పట్నం ఓడ రేవు

కృష్ణ పట్నం ఓడ రేవు

కృష్ణ పట్నం ఓడ రేవు ఆసియా ఖండం లోనే అతిపెద్ద ఓడరేవు గా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ పూర్వం శ్రీకృష్ణదేవరాయల కాలంలో సుగంధ ద్రవ్యాల దిగుమతి జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం సహజ ఓడరేవుగా ఉన్న కృష్ణపట్నం చెక్కర, బొగ్గు, భారీ యంత్ర సామగ్రి లను దిగిమతి చేసుకుంటుంది.

Photo Courtesy: Venkatesh cherukuru

కండ లేరు డ్యామ్

కండ లేరు డ్యామ్

ప్రపంచంలోనే అతి పెద్ద మట్టి డ్యామ్ నెల్లూరు జిల్లాలోని కండ లేరు డ్యామ్. దీని పొడవు 11 కి. మీ కాగా, తిరుపతి మరియు చెన్నై ప్రజలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్నది. చుట్టూ పచ్చని అడవులతో, గుట్టలతో నిండిన ఈ డ్యామ్ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నది.

Photo Courtesy: KING MAKER

పాటూరు

పాటూరు

పాటూరు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఒక గ్రామం. ఇక్కడ హ్యాండ్ లూం చీరలు మరియు చేతితో చేసిన ఇతర వస్తువులు తయారవుతాయి. ఇక్కడ ప్రసిద్ధ తెలుగు కవి తిక్కన సోమయాజి జన్మించినాడు. నెల్లూరు వచ్చే పర్యాటకులు ఈ పాటూరు గ్రామాన్ని తప్పక సందర్శించి చీరలను కొనుగోలు చేస్తారు.

Photo Courtesy: kattulaus

భోజన ప్రియులకు ...

భోజన ప్రియులకు ...

నెల్లూరులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది నెల్లూరు చేపల పులుసు. ఈ చేపల పులుసు ఎంత రుచిగా ఉంటుందో తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది. రంగు, రుచి, సువాసన వాటికవే పోటీపడుతుంటాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు కొన్ని పాశ్చాత్య దేశాలలోని ఆంధ్ర హోటళ్ళలో ఈ నెల్లూరు చేపల పులుసు వడ్డిస్తుంటారు. కనుక నెల్లూరు వెళ్లే పర్యాటకులు ఈ పులుసు ఒకసారి రుచి చూడటం మరవకండి. దీనితో పాటుగా మలైకాజా కి కూడా నెల్లూరు ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy: SekharV

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

నెల్లూరు కు ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం

తిరుపతి లో కల ఎయిర్ పోర్ట్ నుండి నెల్లూరు చేరవచ్చు. దీని దూరం 130 కి. మీ. లు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్, విశాఖపట్నంలకు విమానాలు కలవు. నెల్లూరు కు సమీప అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ 177 కి. మీ. ల దూరంలో చెన్నై నగరం లో కలదు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

ట్రైన్ ప్రయాణం

నెల్లూరు కు రైలు స్టేషన్ కలదు. చెన్నై నుండి మూడు గంటల ప్రయాణంలో నెల్లూరు చేరవచ్చు. వయా నెల్లూరు అనేక ట్రైన్ లు ప్రయాణిస్తాయి.

రోడ్డు ప్రయాణం

నెల్లూరు పట్టణం చెన్నై కు నాలుగు వరుసల రోడ్డు మార్గం ద్వారా కార్లు లేదా బస్సు లలో ప్రయాణించవచ్చు. చెన్నై, హైదరాబాద్ లకు రెగ్యులర్ బస్సు సర్వీస్ లు కలవు.

Photo Courtesy: Goutham Sudalagunta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more