Search
  • Follow NativePlanet
Share
» »చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా!

చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా!

చారిత్రక కట్టడాలు ఒకనాటి చరిత్రకు మూగసాక్ష్యాలు. పుస్తకాలలోని చరిత్రను అధ్యయనం చేయడం ఎంత ముఖ్యమో, ఆ చరిత్రకు ఆనవాళ్ళుగా మిగిలిన కట్టడాలను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యం. ఆ నిర్మాణాలు భ‌విష్య‌త్తు త‌రాల‌కు మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కాలు. అబ్బుర‌ప‌చే అద్భుతాలు. అందుకే శ్రీ‌కాకుళం జిల్లాలోని చారిత్ర‌క నిర్మాణాలను చూసేందుకు బ‌య‌లుదేరిన మా బృందం అనుభ‌వాలు మీకోసం.

చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)చారిత్ర‌క నిర్మాణాల నేల‌.. సిక్కోలు జిల్లా! (రెండ‌వ భాగం)

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని గార మండలంలో శాలిహుండం వెళ్లేందుకు మా బృందం సొంత వాహ‌నంలో బ‌య‌లుదేరింది. ఈ జిల్లాకే తలమానికంగా 354 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఇది. పూర్వం శాలిహుండానికి శాలివాటిక(బియ్యపు ధాన్యాగారం) అనే పేరు ఉండేదట‌. శల్యపేటిక(ఎముకుల పెట్టె) అని కూడా పిలిచేవారు. ఉద‌యం బ‌య‌లుదేర‌డంతో తొంద‌ర‌గానే అక్క‌డి చేరుకున్నాం. వంశధార నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతం ప్రకృతిసిద్ధమైన అందాలతో ఎంతో రమణీయంగా క‌నిపిస్తూ.. మా బృందానికి ఆహ్వానం ప‌లికింది. పురావస్తుశాఖ తవ్వకాలలో ఇక్కడ ఎన్నో వృత్తాకార బౌద్ధ కట్టడాలు, స్థూపాలు, రాతి విగ్రహాలు బయటపడ్డాయి. అవి చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవంటే న‌మ్మండి.

 భిన్న‌మైన నిర్మాణ శైలి..

భిన్న‌మైన నిర్మాణ శైలి..

అలనాటి భౌద్దుల నిర్మాణశైలి మ‌మ్మ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఈ గోడ‌ల‌లో ఎక్క‌డా రాతిని వినియోగించ‌క‌పోవ‌డం చూస్తే మాకు ఆశ్చ‌ర్యం క‌లిగింది. పెద్ద‌సైజులో ఉన్న ఇటుక‌ల‌తో దృడంగా నిర్మించారు. ఆ నిర్మాణాల‌పైనుంచి చూస్తే ఉర‌క‌లు వేసే న‌దీతీర అందాలు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించాయి. ఇక్క‌డికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల పేటలోని మెట్టగుడ్డి ప్రాంతంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో కొన్ని బౌద్ధమత అవశేషాలు లభించాయి. అలాంటి చారిత్రక ఆనవాళ్ళు శాలిహుండంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో మేం చూడ‌గ‌లిగాం. అవేకాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పురావస్తుశాఖ తవ్వకాలలో బయటపడిన కొన్ని రాతి దేవతా విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. ఏటా వందలాది మంది ప్రజలు వీటిని సందర్శిస్తూ ఉంటారు.

 దంత‌పురి కోట‌లో అడుగులు..

దంత‌పురి కోట‌లో అడుగులు..

మా బృందం మ‌రుస‌టి రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో రొట్టవలస గ్రామ సమీపంలో దంతపురి ప్రాంతానికి బ‌య‌లుదేరింది. ఇది ముఖ్యమైన పురాతన బౌద్ధ ప్రదేశం. ఇక్కడ బౌద్ధ మతస్థులు నివసించేవారని ప్రతీతి. క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బౌద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని కళింగరాజులు తమ మత రాజధానిగా భావించేవారు. ఇది బౌద్ధ జ్ఞాన దంతపురిగా కూడా పిలవబడుతోంది. పురాతత్వ పరిశోధకుల తవ్వకాలలో కొన్ని ఇటుకలు, బౌద్ధస్థూపాలు, కుండలు, టెర్రాకోట పాత్రలు, గాజు, రాతి, ఇనుప వస్తువులు కనుగొన్నారు. ధనగుప్తుడు అనే రాజు పరిపాలనలో మట్టితో నిర్మించిన ఈ కోట సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కోట చుట్టూ యాభై అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల ఎత్తు కలిగిన మట్టి గోడలు అలనాటి కోటకు ఆనవాళ్లుగా ఉన్నాయి. తవ్వకాల్లో బయటపడిన ఆధారాల ప్రకారం ఇక్కడి నుండి వంశధార నదికి ఒక సొరంగ మార్గం ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

శిథిలావ‌స్త‌లో చరిత్ర‌..

శిథిలావ‌స్త‌లో చరిత్ర‌..

కానీ మేం చూసిన ప‌రిస్థితి అందుకు భిన్నంగా అనిపించింది. ఇంతటి చరిత్ర కలిగిన దంతపురి నేడు అక్రమార్కుల చేతుల్లో చిక్కుకుంద‌ని స్థానికులు చెప్పుకొచ్చారు. ఐదు వందల ఎకరాల కోట భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. తవ్వకాలలో బయటపడిన స్థూపాలకు సంరక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడి భూమిలో లభించిన రాతి విగ్రహాలకు స్థానికులే ఆలయాన్ని నిర్మించి ఏటా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, చారిత్రక కట్టడాలకు సంరక్షణ ఉంటుందని స్థానికులు అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. అక్క‌డి నుంచి మా ప్రయాణం మ‌రో చారిత్ర‌క నిర్మాణంవైపు సాగింది. ఆ విశేషాలు రెండో భాగంలో..!

Read more about: srikakulam dantapuri fort
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X