Search
  • Follow NativePlanet
Share
» »తిరుప‌తి - కొండ‌ల‌లో నెల‌కొన్న ప‌ర్యాట‌క అందాలు!

తిరుప‌తి - కొండ‌ల‌లో నెల‌కొన్న ప‌ర్యాట‌క అందాలు!

ఏడు కొండ‌లు అన‌గానే అంద‌రికి గుర్తొచ్చేది తిరుప‌తి! దైవ క్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం వెనుక అనేక చారిత్ర‌క విశేషాలు దాగి ఉన్నాయి. అంతేకాదండోయ్‌, అడుగ‌డుగునా స్వాగ‌తం ప‌లికే ఇక్క‌డి స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి సోయ‌గాల్ని క‌నులారా వీక్షించాల్సిందే. తిరుప‌తిని ద‌ర్శించుకుంటే మోక్షం ల‌భిస్తుందో లేదో గానీ, ఇక్క‌డి ర‌మ‌ణీయ‌మైన ప్ర‌కృతి ఒడిలోకి తొంగిచూస్తే మాత్రం అన్ని మ‌రిచిపోయి హాయిగా సేదదీర‌డం మాత్రం ఖాయం. ఇంకెందుకాల‌స్యం తిరుపతి కొండ‌ల‌లో నెల‌కొన్న ప‌ర్యాట‌క అందాలను చూసొద్దాం రండి!

గాఢ‌నిద్ర‌లో ఉన్న నాకు ఒక్క‌సారిగా... తిరుమ‌ల‌వాసా....శ్రీ వెంక‌టేశా..! అంటూ గ‌ట్టిగా ఓ పాట వినిపించింది. బ‌ద్ధ‌కంగా క‌ళ్లు తెరిచాను. ఆ ఘ‌న‌కార్యం చేసింది బస్సు డ్రైవ‌ర్‌. తిరుప‌తి వ‌చ్చేసింది, బ‌స్సు దిగ‌డానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేందుకు ఆ పాట ఓ సంకేతం కావొచ్చు. వీరి భ‌క్తిని ఈ రూపంలో చాటుకుంటున్నార‌నిపించింది. అంత‌లో దిగాల్సిన బ‌స్‌స్టాండ్ వ‌చ్చేసింది. ఏడుకొండ‌లు బ‌స్‌స్టేష‌న్ అని తాటికాయంత అక్ష‌రాల‌తో క‌నిపించింది. పిల్ల‌ల్ని సంక‌నెత్తుకుని ఒక‌రు, ల‌గేజ్‌ల‌ను ఈడ్చుకుంటూ మ‌రొక‌రు, ఇలా బ‌స్‌స్టాండ్ మొత్తం ఒక‌టే హ‌డావుడి. కొత్త ప్రాంతం, కొత్త వ్య‌క్తులు అంతా అయోమ‌యంగా ఉంది. వెంట‌నే జేబులో ఉన్న సెల్‌ఫోన్ తీసి స్థానికంగా ఉన్న నా కొలీగ్ ముత్యాల అనిల్‌కు ఫోన్ చేశా. మా వాడికి ఎప్పుడు ఫోన్ చేసినా తిరుప‌తి మ‌న‌కు కొట్టిన పిండి, ఇక్క‌డ అణువ‌ణువూ నాకు తెలుసు. ఎప్పుడొచ్చినా ఒక్క ఫోన్ కొట్టు భ‌య్యా క్ష‌ణాల్లో వాలిపోతాను అనే మాట‌ల్ని చెప్ప‌కుండా ఉండ‌డు. అందుకే ఆ నెంబ‌ర్ పైకి నా వేళ్లు వెళ్లాయి. ఇలా ఫోన్ చేశానో లేదో అలా ర‌య్‌మంటూ బైక్‌పై వ‌చ్చేశాడు.

Tirumala Hills

రాతిక‌ట్ట‌డం.. భ‌లే ఆశ్చ‌ర్యం

బ‌స్టాండ్‌కు నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది క‌పిల తీర్థం. నిత్యం బ‌స్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. మేము బైక్‌పైన అక్క‌డికి చేరుకున్నాం. మ‌డిక‌ట్టుకొని తిరుగుతున్న భ‌క్తులు ఒక‌టే హ‌డావుడి చేస్తూ క‌నిపించారు. లోప‌ల‌కు వెళ్తూ అంద‌రూ చెప్పులు బ‌య‌ట వ‌దులుతున్నారు. అంత‌లో అక్క‌డ చెప్పులు పెడితే మాయ‌మైపోతాయి. ఇక్క‌డ లోప‌ల పెట్టి టోకెన్ తీసుకొండి అని ఓ కేక వేశాడు బాబాయ్‌. అంతే భ‌క్తి మాట దేవుడెరుగు, చెప్పులు ముఖ్యం అనుకుని చెప్పుల స్టాండ్ ముందు క్యూ క‌ట్టారు భ‌క్తులు. ఒక‌వైపు దేవుని సేవ‌లో భ‌క్తులు మునిగిపోతుంటే, మ‌రోవైపు ఆ భ‌క్తుల చెప్పుల‌నే మాయం చేసే ఘ‌రానా మోస‌గాళ్లు కూడా ఉంటారా? ఏంటో విడ్డూరం! అనుకుంటూ గాబ‌రాగా ముందుకు వెళ్లారో పెద్దాయ‌న‌. ఆయ‌న వెన‌కాలే మేం లోప‌ల‌కు వెళ్లాం. ఎదురుగా ఓ విగ్ర‌హం క‌నిపించింది. ప‌ళ్లెంలో చిల్ల‌ర‌పెడితే త‌ల‌పై శ‌ఠ‌గోపం ఒక్క క్ష‌ణం, నోట్లు పెడితే నాలుగైదు క్ష‌ణాలు ఉంటుంది. అలా లోప‌లకు వెళ్లిన పెద్దాయ‌న ఏదో కోల్ప‌యిన‌ట్లే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆయ‌న జేబులో నోట్లు లేవ‌ని అర్థ‌మైంది. సొమ్ములుంటే పుణ్యం పొర్లుకొస్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌క‌మోమో అని మ‌న‌సులో అనుకున్నాం.

Tirumala Balaji Temole

ఎదురుగా స్వ‌చ్ఛ‌మైన నీటితో నిండిన ఓ పుష్ప‌రిణి ఉంది. ఎక్క‌డో కొండ‌పైనుండి జాలువారే జ‌ల‌పాత‌పు నీరు ఆ పుష్క‌రిణిలోకి చేరుతుంది. అలా నిత్యం అంత ఎత్తు నుండి నీరు ప‌డ‌టం వ‌ల్ల అక్క‌డ గుంత ఏర్ప‌డింద‌ని స్థానికులు విశ్వ‌సిస్తారు. కొల‌ను చుట్టూ ఉన్న రాతిక‌ట్ట‌డం భ‌లే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అయితే ఆధ్యాత్మిక వివ‌రాలు త‌ప్పించి, అక్క‌డి చారిత్ర‌క విశేషాలు తెలిపే ఎలాంటి బోర్డులూ మాకు క‌నిపించ‌లేదు.

ప‌క్షి జాతులకు గుర్తుగా..

క‌పిల తీర్థానికి ఆనుకుని ఉన్న జంగిల్ బుక్ ప్ర‌త్యేకంగా క‌నిపించింది. ఐదు రూపాయ‌ల టిక్కెట్ తీసుకుని, లోప‌ల‌కు ప్ర‌వేశించాం. కిలోమీట‌ర్ మేర విస్త‌రించి ఉన్న అక్క‌డి ప్రాంగ‌ణం కుటుంబ‌స‌మేతంగా వ‌చ్చే ప‌ర్యాట‌కుల్ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా అక్క‌డ ఏర్పాటు చేసిన సైన్స్ బోర్డులున్నాయి. అంత‌రించిపోతున్న వివిధ ప‌క్షిజాతుల‌కు గుర్తుగా ఈ జంగిల్‌బుక్ ఏర్పాటు చేశారు. వ‌య్యారాలు వొలికిస్తున్న నెమ‌ళ్ల నాట్యాలు క‌ళ్లారా చూడాల్సిందే. రోజుకు వంద‌మందికి పైగా సంద‌ర్శ‌కులు వ‌స్తార‌ని అక్క‌డి సిబ్బంది తెలిపారు. లోప‌ల ప‌ర్యాట‌కులు సేద‌దీరేందుకు ఏర్పాటు చేసిన విడిది పందిరి నుండి చూస్తే మాల్వాడి గుండం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎత్త‌యిన రాతి కొండ‌ల‌పై నుండి జాలువారే జ‌ల‌పాతాన్ని ఇక్క‌డ వీక్షించ‌వ‌చ్చు.

నా మూడు రోజుల తిరుప‌తి ప్ర‌యాణాన్ని ఒక్క భాగంగా చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే. అందుకే మ‌రో సారి మీ ముందుకు వ‌స్తాను. మ‌రో భాగంలో మ‌నం మాట్లాడుకుందాం!

Tirumala Balaji Temole

ఎలా చేరుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య ప‌ట్ట‌ణాల నుంచి తిరుప‌తి వెళ్లేందుకు రైలు, బ‌స్సు సౌక‌ర్యాలు ఉన్నాయి. అలాగే దేశంలోని అన్ని ప్రధాన రైల్వే కేంద్రాల నుంచి కూడా రైలు ప్ర‌యాణం ద్వారా తిరుప‌తి చేరుకోవచ్చు. ఢిల్లీ, చెన్నై, హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, విశాఖ‌ప‌ట్ట‌ణం, బెంగ‌ళూరు వంటి ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల నుంచి డొమ‌స్టిక్ విమాన సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి. తిరుప‌తి చేరుకున్నాక చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు సంద‌ర్శించ‌డానికి ఎపిఎస్ ఆర్‌టిసి బ‌స్సుల‌తో పాటు ప్ర‌యివేట్ ర‌వాణా అందుబాటులో ఉంటాయి.

Read more about: tirupati andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X