» »ఇండియాలోని 20 మిస్టరీ గుహలు !!

ఇండియాలోని 20 మిస్టరీ గుహలు !!

Posted By:

గుహలు అంటే సాధారణంగా కొండలలో తవ్విన లోతైన ప్రదేశాలు అని అర్థం. అప్పట్లో ఇప్పటి మాదిరి కాంక్రీట్ బిల్డింగ్ లు, ఆపార్ట్‌మెంట్లు ఉండేవి కావు కనుకనే గుహలలోనే జీవనం సాగించేవారు మనుషులు. వారు జంతువులను మచ్చిక చేసుకొని, ఆకులను దుస్తులుగా మలుచుకొని, రాళ్ళను ఒకదానికొకటి రాపిడి చేసి మంటను పుట్టించి జీవితాన్ని సాగదీసేవారు.

అయ్యో ..! మనమెక్కడికో వెళ్ళిపోతున్నాము. అసలు విషయానికి వద్దాం.. మన భారతదేశంలో ఎన్నో చెప్పుకోదగ్గ గుహలు ఉన్నాయి. వాటిలో చాలావరకు గుహలు యునెస్కో సంస్థ చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. కొన్నేమో గుహాలయాలుగా, మరికొన్నేమో పర్యాటకులు చరిత్రను ఒకసారి మననం చేసుకొనే విధంగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన గుహలు ఒకసారి గమనిస్తే ...

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు

మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎలిఫెంటా దీవి లో ఉన్న గుహలను ఎలిఫెంటా గుహలు అని పిలుస్తారు. పూర్వం పోర్చుగీసు వారు వర్తక వ్యాపారం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శించినపుడు ఏనుగుల శిల్పకళా శైలి అధికంగా కనపడింది. అందుకే దీనికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. ఎలెఫెంటా గుహలలో రెండు రకాల గుహలు ఉన్నాయి. వాటిలో మొదటి రకం హిందువులకు సంబంధించినది మరొకటేమో బౌద్ధ మతానికి చెందినది. ముంబై నగరంలోని గేట్ వే ఆఫ్ ఇండియా టర్మినల్ నుండి గంట ప్రయాణ దూరంలో ఉన్న ఈ గుహలకు బోట్ లేదా ఫెర్రీ ల ద్వారా చేరుకోవచ్చు.

Photo Courtesy: Philip Larson

బాదామి గుహలు

బాదామి గుహలు

ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లాలో ఒక లోయలో బాదామి అనే పట్టణం కలదు. ఇక్కడ చాళుక్యుల కాలం నాటి గుహ దేవాలయాన్ని చూడవచ్చు. ఈ గుహ దేవాలయాలు మొత్తం నాలుగు సముదాయాలుగా ఉంది. మొదటిది పురాతమైనది. ఇందులో శివునికి సంబంధించిన శిల్పాలు, చిత్రాలు కనిపిస్తాయి. రెండవ గుహ పూర్తిగా విష్ణుమూర్తి చెక్కాడాలతో ఉంటుంది. ఇక 100 అడుగుల లోతు ఉన్న మూడవ గుహలో విష్ణుమూర్తి త్రివిక్రమ మరియు నరసింహ అవతారాలలో కనిపిస్తాడు. చివరిదైన నాల్గవ గుహ పూర్తిగా జైన మతానికి సంబంధించినది.

Photo Courtesy: Raamanp

అజంతా మరియు ఎల్లోరా గుహలు

అజంతా మరియు ఎల్లోరా గుహలు

ఉత్తర మహారాష్ట్ర రాష్ట్రం లోని ఔరంగాబాద్ జిల్లాలో గల అజంతా మరియు ఎల్లోరా గుహలు ప్రపంచ వారసత్వ సంపద లలో ఒకటిగా గుర్తింపు పొందినాయి. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన పేంటింగ్, శిల్పాలు మరియు చిత్రాలు, చెక్కడాలు ఇక్కడ కనిపిస్తాయి. బుద్ధునికి సంబంధించి అజంతాలో 30 వరకు గుహలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్లోరాలో 34 గుహలుంటే బౌద్ధ మతానికి 12 గుహలు, హిందూ మతానికి సంబంధించి 17 గుహలు మరియు జైన మతానికి సంబంధించి 5 గుహలు ఉన్నాయి.

Photo Courtesy: Youri

దుంగేశ్వరి గుహాలయం

దుంగేశ్వరి గుహాలయం

బీహార్ రాష్ట్రంలోని బుద్ధగయలో ఉన్న దుంగేశ్వరి గుహాలయం నిర్మలత్వానికి, ప్రశాంతతకు మారు పేరు. దీనిని మహాకాల గుహలు అనికూడా సంబోధిస్తారు. జ్ఞానాన్ని పొందిన బుద్ధుడు దానిని అమలు చేయటానికి బుద్ధగయ కి వెళ్లే ముందు ఈ గుహలలోనే తపస్సు చేశాడు. ఇక్కడున్న మూడు గుహలలో హిందూ, బౌద్ధ విగ్రహాలు ఉన్నాయి.

Photo Courtesy: Tanel Saimre

టాబో

టాబో

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని స్పితి లోయ లో ఉన్న గుహల సముదాయమే టాబో గ్రామం. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ టాబో గ్రామాన్ని నిర్మించినారు. ఈ గుహల సముదాయంలో 9 దేవాలయాలు, 23 ఛార్టేన్ లతో పాటు సన్యాసుల గదులు, సన్యాసినుల నివాసాలు ఉన్నాయి. దీనిని "హిమాలయాలలోని అజంతా" అని పిలుస్తారు.

Photo Courtesy: sanlap biswas

ఖండగిరి గుహలు

ఖండగిరి గుహలు

ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఉదయగిరి పట్టణంలో 10 నుండి 20 మీటర్ల దూరంలో ఖండగిరి గుహలు ఉన్నాయి. రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఈ గుహల గోడల మీద శాశనాలు, శిల్పాలు చెక్కినారు. ఈ గుహలు ప్రధానంగా జైన సన్యాసుల నివాసం కొరకు కట్టినవి. ఇక్కడ ప్రతి ఏటా జనవరి చివరి మాసంలో ఎక్కువ సంఖ్యలో సన్యాసులు వచ్చి ధ్యానం చేస్తుంటారు.

Photo Courtesy: Vijay Birajdar

పాతాలేశ్వర్ గుహాలయం

పాతాలేశ్వర్ గుహాలయం

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలో జంగ్లీ మహరాజ్ రోడ్ మార్గంలో పాతాలేశ్వర్ గుహాలయం ఉన్నది. ఇది 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే, ఆలయాన్ని ఒక పెద్ద రాయిని ఒలిచి నిర్మించినారు. ఈ గుహలు ఎలిఫెంటా మరియు ఎల్లోరా గుహలను పోలి ఉంటాయి. ఈ గుహలో ప్రధాన దైవం శివుడు. ఈ గుహాలయాన్ని ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 : 30 వరకు దర్శించవచ్చు.

Photo Courtesy: Ankita Kolamkar

కర్ల - భజ గుహలు

కర్ల - భజ గుహలు

మహారాష్ట్ర రాష్ట్రంలోని ఖండాలా నుండి 16 కి.మీ. దూరంలో కార్ల - భజ గుహలు ఉన్నాయి. దీనిని క్రీ.పూ. 2 వ శతాబ్దంలో నిర్మించినారు. ఇక్కడున్న అపారమైన సౌందర్యం మరెక్కడా కానరాదు. బౌద్ధ హీనాయాన శాఖ కు చెందిన ఈ గుహలు పురాతన బౌద్ధ రాతి గుహాలయాలకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: Dinesh Valke

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడ నగరానికి 6 కి. మీ. దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. 4 అంతస్థులు గా ఉన్న ఈ గుహలు క్రీ. శ. 4 - 5 వ శతాబ్ధంలో గుర్తించబడినాయి. ఇక్కడ నల్ల గ్రనైట్ రాయితో చేసిన పడుకున్న భంగిమల ఉన్న " అంతశయన విష్ణువు " భారీ ఏకశిలా విగ్రహం ఉన్నది. ఈ గుహలను వానాకాలంలో బౌద్ధ సన్యాసులు విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారట.

Photo Courtesy:B B Susheel Kumar

ట్రిచీ రాక్ ఫోర్ట్ ఆలయం

ట్రిచీ రాక్ ఫోర్ట్ ఆలయం

తమిళనాడు రాష్టంలోని ట్రిచీ పట్టణంలో ఉన్న ప్రధాన ఆకర్షణలలో మలై కొటై ఉచి పిల్లయర్ ఆలయం ప్రధానమైనది. ఒక రాతి కోట పై నిర్మించిన ఈ ఆలయంలో వినాయక విగ్రహం తప్పకుండా సందర్శించాలి. ఇది క్రీ. శ. 7 వ శతాబ్ధంలో 83 మీటర్ల పొడవున మధురై నాయకులచే పూర్తి చేయబడినది. రాతి కోట పై ఉన్న ఈ ఆలయం అద్భుతమైనదిగా గుర్తించబడినది. దీనిని భారత పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్నారు.

Photo Courtesy: Jai Santhosh Kumar Raj

బొర్రా గుహలు

బొర్రా గుహలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ క్ 90 కి. మీ .దూరంలో ఉన్న అరకు వాలీ లో బొర్రా గుహలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2, 313 అడుగుల ఎత్తున ఉన్న బొర్రా గుహలు ఇండియాలో కెల్లా పెద్దవి. దేశంలో కెల్లా లోతైన గుహలుగా ముద్రపడ్డ ఈ గుహలు సున్నపు రాయితో ఏర్పడి కాస్త చిన్న గుహలు గా, మరోకొన్ని కాస్త పెద్ద గుహలు గా మార్పు చెందినాయి. ఈ గుహలలో జగదేకవీరుడు అతిలోకసుందరి, జంబలకిడి పంబ కంటి ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలను చిత్రీకరించారు.

Photo Courtesy: Snehareddy

పుదు కొట్టై గుహలు

పుదు కొట్టై గుహలు

సీతన్నవ్సల్ గుహలు తమిళనాడు రాష్ట్రంలోని పుదు కొట్టై జిల్లాలో కలవు. ఇవి క్రీ. శ. 2 వ శతాబ్ధంలో నిర్మించిన జైన దేవాలయ కాంప్లెక్స్. ఈ సముదాయంలో ప్రధానమైనది పేంటింగ్. భారతదేశంలో అజంతా గుహల సముదాయంలో ఉన్న పెయింటింగ్ తరువాత రెండవ స్థానంలో ఈ గుహల పెయింటింగ్ ఉందని చెప్పవచ్చు. ఈ గుహలని ఆరైవర్ గుహలని పిలుస్తారు. ఈ ఆలయం ప్రాంగణంలో ఒక కలువ పువ్వుల కొలను కూడా ఉన్నది.

Photo Courtesy: Ilasun

పాతాల్ భువనేశ్వర్ గుహ

పాతాల్ భువనేశ్వర్ గుహ

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చౌకొరి పట్టణానికి సమీపంలో సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎగువన పాతాల్ భువనేశ్వర్ గుహ ఉన్నది. ఈ గుహలను శివునికి అంకితం చేసినా, ఇక్కడ 33 కోట్ల దేవుళ్ళు, దేవతలు ఉన్నారని నమ్ముతారు. ఒక సన్నని సొరంగ మార్గం ద్వారా గుహ లోపలికి వెళ్ళేటప్పుడు స్టాలాగ్‌మైట్, వివిధ దేవతలు, దేవుళ్ళ చిత్ర కూడ్యాలను చూడవచ్చు. ఈ ప్రదేశం పుణ్యమైనది కనుకనే దీనిని చార్ ధామ్ యాత్రకి సమానంగా భావిస్తారు.

Photo Courtesy: uttarakhand tourism

భింబెట్కా గుహలు

భింబెట్కా గుహలు

మధ్య ప్రదేశ్ లోని రైసన్ జిల్లాలో ఉన్న భింబెట్కా గుహలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. మహాభారతంలోని భీముని పేరు మీద ఈ గుహలకు ఆ పేరొచ్చింది. ఇక్కడున్న 600 గుహలలో పెయింటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోజువారీ మనుషుల జీవన విధానాలను మరియు వివిధ జంతువుల చిత్రాలను అప్పట్లోనే రంగుల పెయింటింగ్ ఉపయోగించి గీశారు. పెయింటింగ్ కోసం ఉపయోగించిన రంగులన్ని సహజ రంగులే ఎటువంటి కెమికల్ ఉపయోగించిన దాఖలాలు లేవు.

Photo Courtesy: sanjay austa

కోటేశ్వర్ గుహాలయం

కోటేశ్వర్ గుహాలయం

కోటేశ్వర్ గుహాలయం అలకనందా నది ఒడ్డున రుద్ర ప్రయాగ్ పుణ్యక్షేత్రానికి 3 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇతిహాసాల మేరకు శివుడు కేదర్నాథ్ వెళ్లే సమయంలో ఇక్కడ ధ్యానం చేసాడని, అపుడు ఆ విగ్రహం సహజంగా ఏర్పడిందని చెబుతారు. ఇక్కడ మహాశివరాత్రి ఘనంగా జరుపుతారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఇక్కడ ఉత్సవాలు సైతం నిర్వహిస్తుంటారు.

Photo Courtesy: Padmanabhan G

ఉదయగిరి గుహలు

ఉదయగిరి గుహలు

ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కి కూత వేటు దూరంలో ఉదయగిరి గుహల సముదాయం ఉన్నది. వీటిని క్రీ. శ. 2 వ శతాబ్ధంలో ఖారావేల రాజు శిల్పకళా ఖండాలకోసం, బౌద్ధ సన్యాసుల నివాసం కోసం నిర్మించాడు. అందంగా చెక్కబడిన శిల్పకళ ఆకృతులు, రాళ్ళను తొలిచి సుందరంగా తీర్చిదిద్దబడిన గుహలను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. సుమారు 18 గుహలు ఉన్న ఈ ఉదయగిరి గుహల సముదాయంలో బౌద్ధ మతస్థులు ధ్యానం చేయటానికి, ప్రశాంత జీవనం గడపటానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు.

Photo Courtesy: Itikanta Mohapatra

వరాహ గుహలు

వరాహ గుహలు

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం లో క్రీ.శ. 7 వ శతాబ్ధం నాటి వరాహ్ గుహలు ఉన్నాయి. ఇవి భారతదేశంలో రాతిని ఒలిచి తయారుచేసిన గుహాలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. మహావిష్ణువు అవతారాలలో ఒకటైన వరాహ అవతారనికి ఈ దేవాలయం అంకితం ఇవ్వబడినది. పల్లవుల శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

Photo Courtesy: Baldiri

మవస్మవి గుహలు

మవస్మవి గుహలు

మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజీ లో సాహసోపేతమైన గుహలు ఉన్నాయి. వీటిని మవస్మవి గుహలు అంటారు. గుహ ప్రవేశం పెద్దగా ఉండి, వెళ్లే మార్గాలు చిన్నగా ఉండి, మలుపుల వద్ద వంగి వెళ్లే విధంగా ఉంటాయి. గుహ లోపల వృక్షజాలం, జంతుజాలాలకి సంబంధించిన ఒక అద్భుతమైన హోమ్ ఉన్నది. ఎటువంటి గైడ్ కానీ లేదా ఏ ఇతర సహాయం లేకుండా గుహలోనికి ప్రయాణించడానికి అనుమతి ఉంది. కేవలం నీరు బోట్లు బోట్లుగా కారి ఏర్పడ్డ శిలల యొక్క అందమైన నిర్మాణం నిజంగా అద్భుతంగా ఉంటుంది.

Photo Courtesy: Ppyoonus

జోగిమర మరియు సీతాబెంగ్రా గుహలు, చత్తీస్ ఘడ్

జోగిమర మరియు సీతాబెంగ్రా గుహలు, చత్తీస్ ఘడ్

చత్తీస్ ఘడ్ రాష్టంలోని సర్గుజా జిల్లాలో పురాతన గుహాలైన జోగిమర మరియు సీతా బెంగ్రా గుహలు ఉన్నాయి. ఏనుగు లోనికి వెళ్లే విధంగా ప్రవేశ మార్గం ఉంటుంది. ఇతిహాసాల మేరకు పూర్వం ఇక్కడ వనవాస సమయంలో రాముడు, సీతా మరియు లక్ష్మణుడు నివసించారని కథనం. ఇక్కడ సీతా దేవి నివాసం ఉంది కనుక దీనికి సీతా బెంగ్రా అనే పేరువచ్చింది. ఇక్కడ కూడా పురాతన కూడ్యా చిత్రాలు, శిల్ప సంపదను చూడవచ్చు.

Photo Courtesy: chhattisgarh tourism

అమర్‌నాథ్ గుహ

అమర్‌నాథ్ గుహ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అమర్‌నాథ్ యాత్ర స్థలంలో చూడవలసిన ప్రధాన ఆకర్షణ అమర్‌నాథ్ గుహ. ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ మంచు శివలింగం ఉంటుంది. ఈ గుహ 5000 ఏళ్ల నాటిదని, ఇక్కడే మహా శివుడు పార్వతి దేవికి అమరత్వ రహస్యం ఉపదేశించాడని భక్తుల నమ్మకం. పూర్తిగా రక్షణ దళాలలు కాపుకాసే ఈ ప్రదేశంలో పర్యటించాలంటే ఉన్నత అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి.

Photo Courtesy: Gktambe