Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌కృతి చెక్కిన శిల్పం.. కేర‌ళ ప‌ర్యా‌ట‌కం!

ప్ర‌కృతి చెక్కిన శిల్పం.. కేర‌ళ ప‌ర్యా‌ట‌కం!

కొన్నేళ్ల‌ క్రితం ప్రకృతి ప్రకోపానికి లోనై, వరదలు విలయతాండవం చేసిన ప్రాంతం కేర‌ళ‌. ఆ ప్రభావం అక్కడి భవిష్యత్తు పర్యాటకాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. తేరుకునేందుకు దశాబ్దాలు ఎదురు చూడాల్సిందే అనుకున్నారు చాలామంది. అలాంటి నిట్టూర్పు ఆలోచనలను పటాపంచలు చేస్తూ.. అనతికాలంలోనే పూర్వవైభవంవైపు పరుగులు తీసింది. మనుషులు తలచుకుంటే ఏదీ అసాధ్యం కాదనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నేడు పర్యాటక ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఇటీవ‌ల కాలంలో అక్క‌డి ప‌ర్యాట‌క అందాల‌ను చూసేందుకు వెళ్లిన మా అనుభ‌వాలు మీ కోసం.

కొబ్బరిచెట్లు కారుతోపాటే పరుగులు తీశాయి

కొచ్చి ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే ఇక్కడి అందాలు నన్ను ప్రభావితం చేశాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొబ్బరిచెట్లు, మా కారుతోపాటే పరుగులు తీశాయి. సముద్రపు అలల సవ్వడులు నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. మేం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరగానే సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. దారి మధ్యలో మా డ్రైవర్‌ టాక్సీని ఓ పక్కన ఆపి, సముద్రం సూర్యుణ్ణి తనలో విలీనం చేసుకుంటున్న దృశ్యాలను మాకు చూపించాడు. చాలాసేపు అలా చూస్తు నిలబడిపోయాం. ఏ ప్రాంతంలో అయితే మేం నిలబడ్డామో, అక్కడ పెద్ద సంఖ్యలో స్థానికులూ ఆ దృశ్యాన్ని తిలకించారు. ఆ సుందరదృశ్యం అక్కడి ప్రతి ఒక్కరి కెమెరాలలో బందీగా మారింది. నిజానికి, ఆ దృశ్యం అక్కడి స్థానికులు ప్రతిరోజూ చూస్తూనే ఉంటారు. అయినా వారికి అది కొత్తగానే ఉంది. అక్కడివారి ఆ స్వభావమే కేరళని మరింత కొత్తగా చూపించేలా చేస్తుంది. ఏ ప్రాంత ప్రజలయితే ఆ ప్రాంత ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకుంటారో వారే ఇతరులకు బాగా వివరించగలరనే విషయం అర్థమైంది.

Kerala

ప్రజలు ఎంత ప్రేమిస్తున్నారో ఓ ఉదాహరణ

పరిశుభ్రతలోనూ కేరళ ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ విషయంలో మాకు ఎదురైన ఓ అనుభవం మీతో పంచుకోవాలి. మా జర్నలిస్టు మిత్రుడు రిపోర్టింగ్‌ నిమిత్తం ఓసారి కేరళ వచ్చాడు. ప్రయాణం మధ్యలో వారి బృంద సభ్యులు ఖాళీ వాటర్‌బాటిల్‌ను కారులో నుంచి బయటికి విసిరేశారు. టాక్సీడ్రైవర్‌ వెంటనే టాక్సీ ఆపాడు. 'వెంటనే బాటిల్‌ తీయండి. కేరళను ఇలా అపరిశుభ్రంగా మార్చొద్దు' అని అన్నాడు. ఇక్కడి ప్రజలు కేరళను ఎంత ప్రేమిస్తున్నారో ఈ ఉదాహరణ చాలు. పర్యాటక ప్రాంతాల్లో కేరళ అగ్రస్థానంగా నిలవడానికి ఇలాంటివే కారణాలు. కేరళ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు పర్యాటకుల గురించి మరో ఉదాహరణ చెప్పుకోకపోతే ఈ కథ అర్థవంతంగా ఉండ‌దని పిస్తోంది. అందుకే మరో ఉదాహరణ. 67 యేళ్ల విజయన్‌, 65 యేళ్ల మోహన కొచ్చిలో ఓ చిన్న టీ కొట్టు నడుపుతుండేవారు. ఈ దంపతులిద్దరూ పర్యాటక ప్రేమికులు. టీ కొట్టు నడపగా వచ్చిన డబ్బులతో వారికి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేసేవారు.

బ్యాంకులో అప్పు తీసుకొని మ‌రీ..

వీరికి తిరగడం అంటే ఎంత ఇష్టమంటే, డబ్బులు లేకపోతే బ్యాంకులో అప్పు తీసుకుని మరీ విహరిస్తుంటారట! గతంలో వచ్చినప్పుడు వీరిద్దరినీ కలవడం నా కేరళ ప్రయాణంలో ఎంతో గుర్తుండిపోయే జ్ఞాపకం. విదేశాల‌తోపాటు భారత్‌లోని ఏ ప్రాంతాన్నీ వీరు వదిలిపెట్ట‌లేదు. ఇన్ని ప్రాంతాలు చుట్టేయడానికి మీకున్న ప్రేరణ ఏంటి అని అప్ప‌ట్టో విజయన్‌ని అడగ్గా, 'నేనొక చిన్న గ్రామంలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి ఆ గ్రామాన్ని వదిలి, కొచ్చిలాంటి పెద్ద నగరాన్ని తిరగాలనే ఆశ ఉండేది. ఒక్కసారి కొచ్చీ చేరుకున్న తర్వాత ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆశ బలపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకాళ్లు ఒక్కచోట నిలకడగా ఉండడం లేదు'' అని సమాధానమిచ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు గ‌తేడాది విజ‌య‌న్ మ‌ర‌ణించారు. అయిన‌ప్ప‌టికీ మాలాంటి పర్యాటకులకు విజయన్‌, మోహనా ఎప్ప‌టికీ ప్రేరణగా నిలుస్తారు.

మా దృష్టిలో ప‌ర్యాట‌కం అంటే ప్ర‌దేశాలు మాత్ర‌మే కాదు. అక్క‌డి అనుభ‌వాల స‌మ్మేళ‌నం. అందుకే మేం ఆస్వాదించిన మ‌రిన్ని అనుభ‌వాల‌ను మ‌రో భాగంలో పంచుకుంటాం.

Read more about: kochi kerala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X