Search
  • Follow NativePlanet
Share
» »కొండ‌ల‌లో నెల‌కొన్న ప‌ర్యాట‌క అందాలు (రెండ‌వ భాగం)

కొండ‌ల‌లో నెల‌కొన్న ప‌ర్యాట‌క అందాలు (రెండ‌వ భాగం)

తిరుప‌తిలోని జంగిల్ బుక్ తిర‌గాడిన త‌ర్వాత అక్క‌డి నుండి గ‌రుడా స‌ర్కిల్ మీదుగా మా ప్ర‌యాణం సాగింది. అలా ఆరు కిలోమీటర్లు వచ్చాక రోడ్డుకు ఎడ‌మ‌వైపున క‌నిపిచింది ఎస్‌వి జూలాజిక‌ల్ పార్క్. బైక్ పార్క్ చేసి టిక్కెట్ కౌంట‌ర్ ద‌గ్గ‌రకు వెళ్లాం. ఒక్కొక్క‌రికి ఇర‌వైరూపాయ‌లు ప్ర‌వేశ రుసుం. టిక్కెట్ తీసుకుంటున్న స‌మ‌యంలో నా ఫోన్ మోగింది. ఏంటి సార్ స్మార్ట్ ఫోనా? అని అడిగారు అక్క‌డి సిబ్బంది. అవున‌ని గ‌ర్వంగా ఫీల‌వుతూ చెప్పాను. అయితే దానికి ఓ ఇర‌వై రూపాయ‌ల టిక్కెట్ తీసుకోవాలి సార్! అన్నారు. అదేంటి అనేలోగా, కెమెరా ఫోన్ క‌దా! సార్ దానికి సెప‌రేట్ ఛార్జ్ అన‌గానే నా గ‌ర్వం గాలిలో క‌లిసిపోయింది. ఏం చేస్తాం వేల రూపాయ‌లు పెట్టి కొనుక్కున్న ఫోన్ ఇర‌వై రూపాయ‌ల కోసం వ‌దులుకోలేం క‌దా? అనుకుని దానికీ టిక్కెట్ తీసుకున్నాం.

ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అనుభూతి

వంద‌ల ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న జూని శ్ర‌మ ప‌డ‌కుండా తిల‌కించేందుకు బ్యాట‌రీ వాహ‌నాల్ని ఏర్పాటు చేశారు. పెద్ద‌ల‌కు ముప్పై రూపాయ‌లు, పిల్ల‌లకు ప‌ది రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నారు. అయితే జూలో మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్నాయ‌ని మేం వెళ్లే స‌మ‌యానికి బ్యాట‌రీ వాహానాల్ని నిలిపేశారు. చేసేది లేక, చ‌ల్ల‌ని జూ వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తూ న‌డ‌క ప్రారంభించాం. కృష్ణ‌జింక‌లు, దుప్పి, జిరాఫి, నెమ‌ళ్ల వివిధ ర‌కాల ప‌క్షులు, అడ‌విదున్న‌లు ఇలా ఒక్కొక్క‌టిగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. అలా ప‌చ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో సేద‌తీరుతూ సాగే వ‌న్య‌మృగాల సంద‌ర్శ‌న మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. క‌ళ్ల‌తో చూసి తీరాల్సిందే. కొంత‌దూరంలో ల‌య‌న్ స‌ఫారీ ఎదురైంది. అంటే ఓ సుర‌క్షిత‌మైన వాహానంలో సింహాల మ‌ధ్య‌నుంచి ప్ర‌యాణించ‌డం. అందుకు ఒక్కొక్క‌రికి 25 రూపాయ‌లు చెల్లించాలి. అలా టోకెన్ తీసుకుని సింహాలు ఉండే ప్ర‌దేశానికి వెళ్లాం. వాహానం ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే సింహాల‌ను మా కెమెరాలో బంధించాం. భీక‌రంగా అరుస్తూ అంత పెద్ద సింహాలు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే ఆ క్ష‌ణాలు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అనుభూతి.

రాజ‌సం ఉట్టిప‌డేలా చంద్ర‌గిరి కోట

బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, జూ నుండి బైపాస్ మీదుగా ఏడు కిలో మీట‌ర్లు ముందుగా సాగాం. ఓ పెద్ద రాతికొండ‌ను ఆనుకొని క‌నిపించింది చంద్ర‌గిరి కోట‌. గ్రామం ప్ర‌వేశ‌ద్వారం పెద్ద‌పెద్ద రాతి బండ‌ల‌తో నిర్మించ‌బ‌డి, రాజ‌సం ఉట్టిప‌డేలా క‌నిపించింది. క్రీ.శ‌. 1000 ల కాలంలో ఈ నారాయ‌ణ వ‌నాన్ని ప‌రిపాలించిన ఇమ్మ‌డి యాద‌వ న‌ర‌సింహారాయ‌లు నిర్మించిన‌ట్లు చారిత్ర‌క ఆన‌వాళ్లు అక్క‌డ ఉన్నాయి. అర‌వీటి వంశం విజ‌య‌న‌గ‌ర పాల‌న బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన త‌ర్వాత క్రీ.శ 1585లో చంద్ర‌గిరి కోట స‌ర్వ‌తోముఖాభివృద్ధి చేసిన‌ట్లు శిలాఫ‌ల‌కాలు ఉన్నాయి. కోట ముందుభాగంలో రాజ‌మ‌హాల్ ప్రస్తుతం మ్యూజియంగా కొన‌సాగుతోంది. ఇందులో మూడు వంద‌ల‌కు పైగా పురాత‌న విగ్ర‌హాలు భ‌ద్ర‌ప‌రిచారు. అందులో 15,16 శ‌తాబ్దాల‌కు చెందిన వివిధ పంచ‌లోహా విగ్ర‌హాలు కూడా ఉన్నాయి. మ‌హాల్ లోప‌లి భాగం అంతా విచిత్రంగా ఉంటుంది. దారి క‌నుక్కోవ‌డం క‌ష్టసాధ్యంగా క‌నిపిస్తుంది. శ‌త్రువులు లోప‌ల‌కు ప్ర‌వేశించి బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు గంద‌ర‌గోళం చెందేలా దీని నిర్మాణం ఉంది. దానిని ఆనుకుని రాణీమ‌హాల్ ఉంది. అయితే వీటి పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అధికారులు ఎవ్వ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల మాకు నిరాశే మిగిలింది.

పుస్త‌కాల్లో ఉండే చ‌రిత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా..

కోట ప్రాంగ‌ణంలో కొల‌ను ఉంది. అందులో ప‌ర్యాట‌కులు బోటింగ్ చేసేందుకు బోట్‌లు ఏర్పాటు చేశారు. వాటిని మా కెమెరాల్లో బంధిస్తుండ‌గా ముప్పైమందికి పైగా పిల్ల‌ల‌ను కోట సంద‌ర్శ‌న‌కు ముగ్గురు ఉపాధ్యాయుల‌ను తీసుకొచ్చారు. వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి కాస్త ముచ్చ‌టించాం. పిల్ల‌ల‌కు కోట చ‌రిత్ర‌ను, ద‌గ్గ‌ర‌లోని సంద‌ర్శ‌నీయ ప్రాంతాల‌ను చూపించ‌డానికి తీసుకువ‌చ్చాం. వారి పుస్త‌కాల్లో ఉండేది ఈ చ‌రిత్రేగా ? వాటిని క‌ళ్లారా చూస్తే వారికి ఇంకా బాగా అర్థ‌మ‌వుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఉపాధ్యాయులు. నిజ‌మే ! పుస్త‌కాల్లో ఉండే చ‌రిత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా చూస్తే భ‌లే ఆస‌క్తిగా ఉంటుంది. వీళ్లు ఎంత మంచి ప‌ని చేస్తున్నారు అనుకుంటూ అక్క‌డి నుండి బ‌య‌లుదేరాం.

ఇప్ప‌టికే లేట్ అయింది. ఈ రోజుకీ మా ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. మ‌రిన్ని తిరుమ‌ల విశేషాల‌తో మ‌ళ్లీ క‌లుద్దాం. మీరు కూడా మ‌రిన్ని ప‌ర్యాట‌క అందాల్ని వీక్షించేందుకు, అద్భుత విశేషాల‌ను తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండే..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X